స్నానానికి ముందు కొబ్బరి నీళ్ళలో కాస్త పెసరపిండి కలిపి..?
కొన్ని సార్లు మొటిమలు పోయి మచ్చలు మాత్రం మిగిలిపోతుంటాయి. అలాంటప్పుడు కొబ్బరి పాలతో ప్యాక్ వేసుకుంటే ఫలితం ఉంటుందని చెప్తున్నారు బ్యూటీషన్లు. మరి ప్యాక్ ఎలా వేసుకోవాలంటే.. కొబ్బరిపాలలో స్పూన్ గులాబీ నీరు, నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే.. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే తప్పక మచ్చలు పోతాయి.
కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో నిమ్మరసం, పసుపు కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత వెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే నిర్జీవంగా మారిన చర్మం కొత్త కాంతిని పొందుతుంది.
రోజూ స్నానానికి ముందు కొబ్బరి నీళ్ళలో కాస్త పెసరపిండి, తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా పట్టించాలి. ఆపై 15 నిమిషాల తరువాత కడుక్కోవాలి. ఇలా రోజూ స్నానానికి ముందు చేస్తే చర్మం శుభ్రపడుతుంది. మచ్చలు తగ్గుతాయి.
తరుచు మృతుకణాల సమస్య వేధిస్తుంటే.. కొబ్బరి తురుములో స్పూన్ పాలమీగడ, తేనె, నిమ్మరసం, శెనగపిండి కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకోవాలి. ఇలా తరచు చేస్తుంటే.. చర్మం తాజాగా, ప్రకాశవంతంగా మారుతుంది.