ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (10:06 IST)

ఆధార్ నంబర్ అడిగితే క్రిమినల్ కేసు... రూ.కోటి జరిమానా...

ఇకపై ఆధార్ నంబరు తప్పనిసరికాదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఆధార్ నంబరుపై సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన మార్గదర్శకాలను జారీచేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా ఆధార్ నంబరు కావాల్సిందేనంటూ డిమాండ్ చేస్తే వారిపై క్రిమినల్ కేసుతో పాటు.. రూ.కోటి జరిమానా విధిస్తారు. ఈ మేరకు చేపట్టిన చట్ట సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 
 
నిజానికి గతకొంతకాలంగా బ్యాంకు ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డు కొనాలన్నా, ఏదేనీ పోటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలన్నా చిరునామా ధృవీకరణగా ఆధార్ కార్డు ఇవ్వాల్సివుంది. ఇకపై ఎవరు అడిగినా ఆధార్ కార్డు ఇవ్వనక్కర్లేదు. ఒకవేళ ఆధార్ కార్డు ఇవ్వాలని ఒత్తిడి చేసిన సంస్థపై రూ.కోటి జరిమానా విధించాలని, అలా అడిగిన వారిపై క్రిమినల్ కేసు పెట్టి మూడు నుంచి పదేళ్ల జైలు శిక్ష విధించాలని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
కేవైసీ ఫార్మాలిటీస్‌లో ఆధార్ తప్పనిసరేమీ కాదని, దాని స్థానంలో ఇతర ఏ కార్డుల జిరాక్సులైనా సమర్పించ వచ్చని, ఆధార్ మాత్రమే కావాలని అడగటం నేరమని పేర్కొంది. కేవలం కేంద్ర నిధులతో పేదలకు అందించే సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్ అనుసంధానం అవసరమని, మరే ఇతర సేవలకూ ఆధార్ అవసరం లేదని క్యాబినెట్ సమావేశం తేల్చింది.