సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (15:55 IST)

ఐఈఎక్స్ గ్రీన్ మార్కెట్‌తో అసాధారణ ప్రయోజనాన్ని ఆంధ్రప్రదేశ్ పొందనుంది

భారతదేశపు అత్యున్నత ఎనర్జీ ఎక్సేంజ్‌ ఇండియన్‌ ఎనర్జీ ఎక్సేంజ్‌ (ఐఈఎక్స్‌). ఆరంభంలో అంటే 2008లో కేవలం విద్యుత్‌ను భౌతికంగా పంపిణీ చేయడంతో కూడిన వర్తకం చేసిన సంస్థ, ఇప్పుడు విద్యుత్‌ మార్కెట్‌, గ్రీన్‌ మార్కెట్‌, సర్టిఫికెట్ల మార్కెట్‌లలో సైతం వాణిజ్యం చేస్తుంది. గత 12 సంవత్సరాలలో ఐఈఎక్స్‌ గణనీయంగా వృద్ధి చెందింది. 50కు పైగా డిస్కమ్‌లు, 500 ఎలక్ట్రిసిటీ జనరేటర్లు సహా 6700కు పైగా నమోదిత సభ్యులు దీనిలో భాగంగా ఉన్నాయి.
 
ఐఈఎక్స్‌ అతి సన్నిహితంగా డిస్ట్రిబ్యూషన్‌ యుటిలిటీలతో కలిసి పనిచేయడంతో పాటుగా మొత్తంమ్మీద వారి విద్యుత్‌ కొనుగోలు ఖర్చును  గణనీయంగా తగ్గిస్తుంది. ఈ విధంగానే ఆంధ్రప్రదేశ్‌లో 2021 ఆర్ధిక సంవత్సరంలో 1000కోట్ల రూపాయలు ఆదా చేసింది. నిజానికి ఏపీ ఇప్పుడు తమ విద్యుత్‌ అవసరాలలో 12-15% ఐఈఎక్స్‌ ద్వారానే సమకూర్చుకుంటుంది. అంతేకాదు, ఏపీ, తెలంగాణాలు ఐఈఎక్స్‌ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు చేయడం మాత్రమే కాదు, గ్రీన్‌ మార్కెట్‌లో విద్యుత్‌ను విక్రయించడమూ చేస్తున్నాయి.
 
ఆంధ్రప్రదేశ్‌, సౌర, పవన, జలవనరుల ద్వారా విద్యుత్‌ను సమకూర్చుకుంటుంది. తమ విద్యుత్‌ అవసరాలను మరింతగా తీర్చుకునేందుకు 10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌లనూ ఏర్పాటుచేస్తుంది. తద్వారా వ్యవసాయ రంగ అవసరాలను తీర్చాలనుకుంటూనే మిగులు విద్యుత్‌ను ఐఈఎక్స్‌ ద్వారా విక్రయించాలనుకుంటుంది.
 
అయితే ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ రంగంలో అతిపెద్ద సవాల్‌ ఏమిటంటే, ఇక్కడ వ్యవసాయ, గృహ విద్యుత్‌ అవసరాలే ఎక్కువగా ఉండటం. సేకరణ వ్యయం తగ్గించడం, ధరలు సరళీకృతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, అది ఆందోళనగానే కొనసాగుతుంది.
 
ఇక రాష్ట్రంలో అత్యంత ఖరీదైన పీపీఏలు ఉండటం చేత ఖజానాకు ఆర్ధికంగా భారంగానూ పరిణమిస్తుంది. ఈ పీపీఏల ద్వారా విద్యుత్‌ సేకరించడానికి బదులుగా సేకరణ కోసం మెరిట్‌ ఆఫ్‌ ఆర్డర్‌లో ఎక్సేంజ్‌ ధరలు జొప్పించినట్లయితే వ్యయం తగ్గుతుంది.
 
గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా, ఫిబ్రవరి 2021లో అత్యధికంగా 207 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. దీనికి ప్రధాన కారణం వ్యవసాయ రంగంలో విద్యుత్‌ సరఫరా ప్రమాణాలను తీసుకురావడం. దీనితో పాటుగా ఉష్ణోగ్రతలు పెరగడం కూడా మరో కారణంగా నిలుస్తుంది.
 
పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యం పరంగా ఆంధ్రప్రదేశ్‌కు చక్కటి అవకాశాలున్నాయి. దేశంలో పునరుత్పాదక విద్యుత్‌లో అధిక వాటానూ కలిగిన రాష్ట్రం ఇది. ఇటీవల ప్రారంభించిన గ్రీన్‌ టర్మ్‌ ఎహెడ్‌ మార్కెట్‌ (జీటీఏఎం) ద్వారా పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి అధికంగా కలిగిన ఏపీ అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్‌ఈసీ మార్కెట్‌ లో రాష్ట్రం తమ మిగులు గ్రీన్‌ విద్యుత్‌ను విక్రయిస్తుండగా జూన్‌ 2021 నుంచి తమ పవన విద్యుత్‌ను గ్రీన్‌ మార్కెట్‌లో విక్రయించాలని, తద్వారా మరింత ఆదాయం ఆర్జించాలని ప్రణాళిక చేసింది.
 
ఏపీలో 10వేల మెగా వాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌లను ఏర్పాటుచేయడానికి ప్రణాళిక చేశారు. ఇది వ్యవసాయ వినియోగదారుల విద్యుత్‌ అవసరాలను తీర్చనుండటంతో పాటుగా మిగులు విద్యుత్‌ను ఐఈఎక్స్‌ వద్ద గ్రీన్‌ మార్కెట్‌లో విక్రయించనున్నారు. నిజానికి ఇండియాలో  సోలార్‌, నాన్‌ సోలార్‌ ఆర్‌ఈసీలను విక్రయిస్తున్న మొట్టమొదటి పంపిణీ సంస్ధగా ఏపీఎస్‌పీడీసీఎల్‌ ఖ్యాతి గడించడం గమనార్హం.