డిసెంబరు 31 వరకు అంతర్జాతీయ విమానాలకు బ్రేక్!
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31వ తేదీ వరకు అంతర్జాతీయ విమానాలకు బ్రేక్ వేసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండో వేవ్ కరోనా విజృంభణతో ఆందోళనకర పరిస్థితులు నెలకొనివున్నాయి. భారత్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో విమానాల రాకపోకల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31 వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే, కొన్ని ప్రత్యేక రూట్లలో డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలు, కార్గో విమానాలు మాత్రం నడుస్తాయని తెలిపింది. కరోనా పరిస్థితులకు అనుగుణంగా విమానాలను నడపనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది.
కరోనా వేళ ప్రయాణాలకు సంబంధించిన ప్రయాణ, వీసా పరిమితుల పేరుతో కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 26న విడుదల చేసిన సర్క్యులర్‌లో మార్పులు చేస్తున్నామని పేర్కొంది.