లలితా జ్యూవెలరీలో ఐటీ సోదాలు.. భారీగా పన్ను ఎగవేత.. నగదు స్వాధీనం!
"డబ్బు ఊరకే రాదంటూ" బుల్లితెరపై పదేపదే ఒక యాడ్ దర్శనమిస్తుంటుంది. ఈ యాడ్‌లో ఉండే వ్యక్తి కిరణ్ కుమార్. ప్రముఖ నగల దుకాణం లలితా జ్యూవెలరీ యజమాని. చెన్నై కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఇందులో ఆదాయపన్ను శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో వెయ్యి కోట్ల రూపాయలకుపైగా లావాదేవీలను లెక్కల్లో చూపకుండా పన్ను ఎగవేసినట్టు గుర్తించారు.
అలాగే, నెల్లూరు, తిరుచురాపల్లి, త్రిసూర్, ముంబై, కోయంబత్తూరు, చెన్నై, మదురై, జైపూర్, ఇండోర్ సహా మొత్తం 27 ప్రదేశాల్లోని ఆ సంస్థ కార్యాలయాల్లో మూడు రోజుల పాటు ఈ తనిఖీలు నిర్వహించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
అయితే, ఆ సంస్థ పేరు, దాని యజమాని పేరును మాత్రం ఆ ప్రకటనలో వెల్లడించకపోవడం గమనార్హం. లెక్కల్లో చూపని రూ.1.2 కోట్ల నగదు, కీలకమైన దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. ఆ జువెలరీ సంస్థకు ఒక్క తమిళనాడులోనే 15 శాఖలున్నాయి.
చెంగల్పట్టు జిల్లా మరైమలర్‌నగర్ సిప్కాట్ ప్రాంతంలో నగల తయారీ కర్మాగారం కూడా ఉంది. విదేశాల నుంచి బంగారం, నగల తయారీకి ఉపయోగించే సాంకేతిక పరికరాలను దిగుమతి చేసుకోవడంలో కోట్లాది రూపాయల మేరకు పన్నుల ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో ఈ నెల 4 నుంచి శనివారం అర్థరాత్రి వరకూ ఆ జువెలరీ సంస్థ యజమాని నివాసగృహం, ప్రధాన కార్యాలయం సహా 27 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు జరిపారు. సుమారు వందమంది ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు సీబీడీటీ(ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు) వర్గాలు తెలిపాయి.
బంగారం కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని నగదు లావాదేవీలు, ఆ సంస్థకు చెందిన బోగస్ రుణ చెల్లింపులు, అడ్వాన్స్ కొనుకోళ్ల రూపంలో రుణ చెల్లింపుల నకిలీ ఖాతాలను గుర్తించారు.
తమపై రుణాల భారం ఉన్నట్లు తప్పుడు ప్రకటనలు ఇచ్చి, పాతబంగారంతో నగల తయారీ, ఇతర అంశాలకు వాడుకున్నట్లు ఆ వ్యాపారి అంగీకరించినట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు.