ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఔషధాల రేట్లు
ఏప్రిల్ 1 నుంచి ఔషధాల రేట్లు పెరగనున్నాయి. సాధారణంగా వినియోగించే వాటితో పాటు మొత్తం 850 రకాల షెడ్యూల్ మందుల ధరలు పెరగబోతున్నాయి.
జ్వరం, బీపీ తదితర సాధారణ వ్యాధుల చికిత్సకు ఉపయోగించే దాదాపు 850 షెడ్యూల్ మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి 10.7 శాతం పెరగనున్నాయి. దీంతో పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌తో సహా పలు అత్యవసర మందుల ధరలు పెరిగిపోనున్నాయి.
జ్వరాలు, ఇన్ఫెక్షన్లు, గుండెజబ్బులు, రక్తపోటు (బీపీ), చర్మవ్యాధులు, రక్తహీనత తదితరాల చికిత్సలో వినియోగించే పారాసెట్‌మాల్, అజిత్రోమైసిన్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడాజోల్ వంటి మందులు ఈ జాబితాలో ఉన్నాయి.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ గణాంకాల ఆధారంగా 2020తో పోలిస్తే 2021 సంవత్సరానికి గాను మందుల టోకు ధరల సూచీ 10.76 శాతం పెరిగినట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ) ప్రకటించింది.