బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (09:29 IST)

రీఫండ్ ఇచ్చే ప్రసక్తే లేదు.. ఎయిర్‌లైన్స్ సంస్థల షాకింగ్ న్యూస్

కరోనా వైరస్ కట్టిడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీన్ని మరో 19 రోజులు అంటే మే 3వ తేదీ వరకు పొడగించడం జరిగింది. దీంతో అప్పటివరకు అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సేవలు బందే. అలాగే, బస్సులు, రైళ్లూ, విమాన రాకపోకలు కూడా నిలిచిపోనున్నాయి. 
 
అయితే, ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి రిఫండ్స్ ఇచ్చే అవకాశం లేదంటూ, ఎయిర్ లైన్స్ సంస్థలు షాకింగ్ న్యూస్ చెప్పాయి. విమానాలు రద్దు అయినా, టికెట్ల రిఫండ్ చేయరాదని నిర్ణయించామని, ప్రయాణికులు అదనపు రుసుములు చెల్లించకుండా, మరో తారీఖును ఎంచుకుని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవచ్చని గో ఎయిర్ వెల్లడించింది.
 
అలాగే, మే 3వ తేదీ వరకూ తమ అన్ని సర్వీసులను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసిన విస్తారా, ఈ సంవత్సరం డిసెంబర్ 31లోగా, ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులు రీ షెడ్యూల్ చేసుకోవచ్చని, రీ బుకింగ్ చేసుకునే సమయంలో చార్జీలు పెరిగితే, ఆ తేడాను చెల్లించాల్సిందేనని తెలిపింది. రీ షెడ్యూలింగ్ స్కీమ్ ఈ నెల 30వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. 
 
అదేవిధంగా ఎయిర్ లైన్స్ సంస్థల వైఖరిపై సీఏపీఏ (సెంటర్ ఫర్ ఏసియా పసిఫిక్ ఏవియేషన్) అసంతృప్తిని వ్యక్తం చేసింది. 14తో లాక్‌డౌన్ తొలగిపోతుందా? లేదా? అన్న విషయం తెలియకుండా టికెట్లను జారీ చేయడం సరికాదని అభిప్రాయపడింది. ప్రయాణికులను నష్టపరిచే ఈ తరహా నిర్ణయంపై విమానయాన సంస్థలు మరోసారి సమీక్ష చేయాలని కోరింది.