రేణిగుంటలో దిగిన చైనీయులను చూసి పారిపోయిన ఆటో, క్యాబ్ డ్రైవర్లు, జనం కూడా...
కరోనా వైరెస్ దెబ్బకు చైనా దేశస్తులను చూస్తే ప్రతి ఒక్కరూ జడుసుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట విమానాశ్రయంలో చైనా నుంచి తమ పని నిమిత్తం పలువురు చైనీయులు విమానం ద్వారా చేరుకున్నారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి బయటకు రాగానే వారిని చూసిన ఆటో, క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాలను తీసుకుని పారిపోయారు. ఎక్కడ తమ వాహనాలను ఎక్కుతారోనని భయపడిపోయారు.
దాంతో చైనా దేశస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటో, టాక్సీ డ్రైవర్లను బ్రతిమాలి ఎలాగైనా తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు చైనీయులు తంటాలు పడ్డారు. జనంతో మాట్లాడేందుకు ముందుకు వెళ్లిన చైనీయులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజలు కూడా వారిని చూసి పరుగులు పెట్టడం గమనార్హం.
విషయం తెలుసుకున్న పోలీసులు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. బెంగళూరు నుంచి మొత్తం 15 మంది రేణిగుంటకు వచ్చినట్లు తెలుసుకుని వారికి కరోనా వైరస్ వున్నదో లేదో చెక్ చేసారు. ఆ తనిఖీలో వారికి కరోనా సంబంధ సమస్య ఏమీ లేదని తేలడంతో వారిని తమ గమ్య స్థానాలకు తీసుకుని వెళ్లారు.