శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

క్యాబ్ డ్రైవర్లకు తెలంగాణ గవర్నర్ హామీ... సమ్మె విరమణ.. సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు రోజుకో విధంగా మారిపోతున్నాయి. గత 16 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ బస్సు కార్మికులతో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను శనివారం ఉదయం 10 గంటలకు చర్చలకు ఆహ్వానించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినా సీఎం కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా, గత 15 రోజులుగా ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోయినా ఆయనకు మాత్రం చీమకుట్టినట్టుగా లేదు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 
 
అదేసమయంలో ఆర్టీసీ కార్మికులకు ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కూడా సంఘీభావం ప్రకటించారు. పైపెచ్చు.. శనివారం జరిగిన రాష్ట్ర బంద్‌కు వారు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీంతో హైదరాబాద్ నగరంలో ట్యాక్సీ, క్యాబ్ సర్వీసులు పూర్తిగా ఆగిపోయాయి. విమాన ప్రయాణీకులతో పాటు.. ఐటీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యం పూర్తిగా దిగజారిపోయింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్ రంగంలోకి దిగారు. చర్చలు జరిపి, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లు సమ్మె విరమించేలా చేశారు. నిజానికి, గవర్నర్‌ తమిళిసై శనివారం రాత్రి 8 గంటలకు చెన్నై నుంచి వచ్చారు.
 
ఆ వెంటనే, ఓ టీవీ చానల్‌లో అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి 10 గంటలకు రాజ్‌భవన్‌ చేరుకున్నారు. ఆ వెంటనే, తెలంగాణ స్టేట్‌ ట్యాక్సీ అండ్‌ క్యాబ్‌ డ్రైవర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌కు నేరుగా ఫోన్‌ చేశారు. చర్చలకు రావాలని ఆహ్వానం పలికారు. వారితో దాదాపు 35 నిమిషాలపాటు చర్చించారు. ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, 40 వేల నుంచి 50 వేల దాకా ఉన్న క్యాబ్‌లు ఆగిపోతే లక్షలాది మందికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేశారు.
 
'రెండు, మూడు రోజులు నాకు సమయం ఇస్తే... మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాను. అధికారులతో చర్చించి, నా వంతు పరిష్కారం చూపుతాను' అని హామీ ఇచ్చారు. దాంతో, చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు జేఏసీ ఛైర్మన్‌ షేక్‌ సలావుద్దీన్‌ ప్రకటించారు. దాంతో, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. క్యాబ్‌ డ్రైవర్ల సంక్షేమం కోసం ఏడు డిమాండ్లతో జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ట్యాక్సీ యాప్‌లపై నియంత్రణ విధించడం, కనీస చార్జీ రూ.120గా నిర్ధారించడం.. ప్రతి కిలోమీటర్‌కు రూ.22 కనీస చార్జీ వసూలు, ఓలా, ఉబర్‌ సంస్థలు 10 శాతానికి మించకుండా కమీషన్‌ తీసుకునేలా నిబంధనలు విధించడం, డ్రైవర్ల సంక్షేమానికి చర్యలు తీసుకోవడం వంటి డిమాండ్లతో ఈ సమ్మెకు పిలుపు ఇచ్చింది. శనివారం ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లు సమ్మెకు దిగారు. విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.