శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (09:29 IST)

పోరాడితే కొలువులు పీకేస్తారా.. కేసీఆర్ కంటే ఆంధ్రోళ్లు నయం : రేవంత్ రెడ్డి

తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తే కొలువులు పీకేస్తారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంతపాలన సాగుతోందనీ, కేసీఆర్ కంటే ఆంధ్రోళ్ళు నయమని ఆయన ఆరోపించారు. 
 
తెలంగాణాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, కార్మికుల బలిదానాలపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టీసీ కార్మికులు పోరాడారని, అలాంటిది నేడు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తే ఉద్యోగాలు పీకేస్తారా? అని ప్రశ్నించారు. 
 
ప్రగతి భవన్‌లో కుక్క చస్తే కేసులు పెట్టిన సీఎం కేసీఆర్‌.. ఆర్టీసీ కార్మిక సోదరులు సురేందర్‌ గౌడ్‌, శ్రీనివాస్ రెడ్డి ఆత్మబలిదానం చేసుకున్నా పట్టించుకోవడలేదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు బంగారు ముద్దలుగా కనిపించిన ఆర్టీసీ కార్మికులు.. ఇప్పుడు మట్టి ముద్దలయ్యారా? అని నిలదీశారు. 
 
ఇద్దరు కార్మికులు చనిపోతే కనీసం ఒక్క తెరాస నేత కూడా రాలేదంటే ఎంత దౌర్భాగ్యమో ఆలోచించాలన్నారు. 50 వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను బజారుపాలు చేసి.. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ విందు భోజనం చేస్తున్నారంటూ ఆరోపించారు. 
 
ప్రత్యేక రాష్ట్రంలో 4 కోట్ల మందిని నట్టేట ముంచుతూ నలుగురు కుటుంబసభ్యులు మాత్రమే విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని విమర్శించారు. ఎందరికో ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన కేసీఆర్‌.. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని రేవంత్ రెడ్డి నిలదీశారు.