శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (13:38 IST)

భార్యకు సీటు ఇవ్వమన్నందుకు ప్రాణాలు కోల్పోయిన భర్త

తన భార్య కూర్చొనేందుకు కాస్తంత సీటు ఇవ్వమన్నందుకు ఓ భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం మహారాష్ట్రలోని లాతూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగింది. భార్యకు సీటు ఇవ్వమని ప్రాధేయపడిన భర్తపై 12 మంది కర్రలతో దాడి చేశారు. దీంతో భార్య కళ్లెదుటే భర్త ప్రాణాలు కోల్పోయాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, లాతూర్‌కు చెందిన జ్యోతి, సాగర్ అనే దంపతులు గురువారం ముంబై - లాతూర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కారు. రైలెక్కిన తర్వాత తన భార్యకు సీటు ఇవ్వమని ఓ మహిళ ప్రయాణికురాలని సాగర్ అడిగాడు. అందుకు ఆమె తిరస్కరించింది. పైగా, వారిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. 
 
ఈ క్రమంలో ఆమెతో పాటూ ప్రయాణిస్తున్న ఇతర మహిళలూ, పురుషులు సాగర్‌తో గొడవకుదిగారు. వీరిమధ్య వివాదం ముదిరింది. దీంతో సాగర్‌పై 12 మంది ప్రయాణికులు ఒక్కసారిగా దాడిచేశారు. ఈ దాడి చేసిన వారిలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. వారిని అడ్డుకునేందుకు జ్యోతి ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. 
 
సహాయం చేయమని ప్రధేయపడినా ఇతర ప్రయాణికులు ముందుకు రాలేదు. ఈలోపు గాయాల కారణంగా స్పృహ కోల్పోయిన సాగర్.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. జ్యోతి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.