శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 మార్చి 2021 (11:30 IST)

కస్టమర్ల కోసం కొత్త స్కీమ్.. ఎస్బీఐ యాన్యుటీ స్కీమ్‌లో చేరితే..?

దేశీయ అతిపెద్ద బ్యాంక్.. ఎస్బీఐ కస్టమర్ల కోసం కొత్త స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఎస్బీఐ కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఒక భాగమనే చెప్పుకోవాలి. ఎఫ్‌డీ స్కీమ్స్‌లో చేరడం వల్ల వడ్డీ వస్తుంది. దీన్ని నెలా, మూడు నెలలు లేదంటే సంవత్సరం చొప్పున తీసుకోవచ్చు. ఇలా కూడా కాకపోతే మీరు పెట్టిన డబ్బులతోపాటు వడ్డీ కలిపి మెచ్యూరిటీ సమయంలో తీసుకోవచ్చు.
 
అయితే ఎస్‌బీఐ మాత్రం ఒక ప్రత్యేక ఎఫ్‌డీ స్కీమ్‌ను అందిస్తోంది. దీని పేరు ఎస్‌బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్. మీరు ఈ స్కీమ్‌లో చేరి డబ్బులు డిపాజిట్ చేసి ఖాతా తెరిస్తే.. ప్రతి నెలా డబ్బులు వస్తాయి. అయితే మీకు మెచ్యూరిటీ సమయంలో ఎలాంటి డబ్బులు రావు. అంటే ఎస్‌బీఐ యాన్యుటీ స్కీమ్‌లో చేరితే.. మీరు డిపాజిట్ చేసిన డబ్బుల్లో కొంత భాగాన్ని, దీనిపై వచ్చే వడ్డీ మొత్తం రెండూ కలిపి ప్రతి నెలా బ్యాంక్ మీకు చెల్లిస్తూ వస్తుంది. దీంతో మీకు మెచ్యూరిటీ సమయంలో ఎలాంటి డబ్బులు రావు. సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఈ స్కీమ్‌కు ఇదే వ్యత్యాసం.
 
మీరు ఈ స్కీమ్‌లో చేరాలంటే కనీసం రూ.60 వేల డిపాజిట్ చేయాలి. నెలకు కనీసం రూ.1,000 వస్తాయి. మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాల పరిమితితో మీరు ఈ స్కీమ్‌లో చేరాల్సి ఉంటుంది. టర్మ్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేట్లే ఇక్కడ కూడా వర్తిస్తాయి.
 
ఉదాహరణకు మీరు ఎస్‌బీఐ బ్యాంక్‌కు వెళ్లి రూ.3 లక్షలు డిపాజిట్ చేసి యాన్యుటీ స్కీమ్‌ కింద ఖాతా తెరిచి... మూడేళ్ల కాల పరిమితి ఆప్షన్ ఎంచుకున్నారు. అలాంటప్పుడు నెలకు రూ.9 వేలు వస్తాయి. ఇక్కడ వడ్డీ రేటు 5.3 శాతంగా పరిగణలోకి తీసుకుంటారు. మెచ్యూరిటీ సమయంలో మాత్రం ఎలాంటి డబ్బులు రావు. ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఈ స్కీమ్‌లో చేరొచ్చునని ఎస్బీఐ తెలిపింది.