గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

సర్వం ప్రైవేటు మయం... తేల్చేసిన కేంద్రం... లాభనష్టాలతో పనిలేదు...

సర్వం ప్రైవేటుమయం కానుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవటీకరణలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేని కేంద్రం తేల్చి చెప్పింది. ఆయా సంస్థలు లాభాల్లో ఉన్నప్పటికీ ప్రైవేటుపరం చేసితీరుతామని కేంద్రం పునరుద్ఘాటించింది. పైగా, ప్రైవేటీకరించడం వల్ల వచ్చే నష్టమేమీ లేదన్నారు. కేవలం యాజమాన్యం మాత్రమే మారుతుందని, ఉద్యోగులంతా ఉంటారని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ స్పష్టం చేశారు. 
 
లోక్‌సభలో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఠాగూర్ సమాధానమిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదన్నారు. ఆయా సంస్థలు నష్టాల్లో ఉన్నాయా, లాభాల్లో ఉన్నాయా అన్నది ప్రాతిపదిక కానేకాదన్నారు. లాభాలు, నష్టాల్లో ఉన్న అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ విధానం వర్తిస్తుందని తెలిపారు. 
 
2016 నుంచి ఇప్పటివరకూ 35 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా ఆమోదం లభించిందన్నారు. నీతి ఆయోగ్‌ సిఫారసుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2021-22 బడ్జెట్‌లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ల క్ష్యం రూ.1.75 లక్షల కోట్లుగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు సర్వం ప్రైవేటుపరం చేయక తప్పదని మంత్రి తేల్చి చెప్పారు.