ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 ఫిబ్రవరి 2021 (12:45 IST)

ప్యాసింజర్ రైళ్ళ పునరుద్ధరణపై ఆదేశాలు రాలేదు : దక్షిణ మధ్య రైల్వే

కరోనా వైరస్ కారణంగా గత యేడాది మార్చి నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా రైళ్ళ రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం కేవలం వందల సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. అదీకూడా ఫెస్టవల్ స్పెషల్ పేరుతో కొన్ని ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అన్ని ప్యాసింజర్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ నిర్ణయించినట్టు వచ్చాయి. దీనిపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ప్యాసింజర్‌ రైళ్లను పునఃప్రారంభించడంపై ఏ నిర్ణయం తీసుకోలేదని, భారతీయ రైల్వే బోర్డు నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నది. 
 
పైగా, ఏప్రిల్‌ నుంచి ప్యాసింజర్‌ రైళ్లన్నీ పూర్తిస్థాయిలో నడుస్తాయన్న వార్తల్లో వాస్తవం లేదని వివరించింది. కరోనాకు ముందు దక్షిణ మధ్య రైల్వే జోన్‌ నుంచి 261 ఎక్స్‌ప్రెస్/మెయిల్‌ రైళ్లు, 357 ప్యాసింజర్‌ రైళ్లు, 118 ఎంఎంటీఎస్‌.. మొత్తం 736 రైళ్లు నడిచేవి. వీటిలో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను దశలవారీగా.. స్పెషల్‌ ట్రైన్‌ పేరుతో ప్రారంభించారు. 
 
ప్రస్తుతం 150 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుస్తున్నాయి. అయితే, ప్యాసింజర్‌ రైళ్ల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని శనివారం ఎస్సీఆర్‌ అధికారులు తెలిపారు. కాగా, రైలు సర్వీసులన్నీ ఎప్పుడు ప్రారంభమవుతాయో ఖచ్చితమైన తేదీని చెప్పలేమని రైల్వేశాఖ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.