ఐఐటీ ప్రవేశాల కోసం జూన్ 4న జేఈఈ అడ్వాన్స్ పరీక్ష
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరానికిగాను బీటెక్ సీట్ల భర్తీ కోసం జూన్ 4వ తేదీన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (జేఈఈ) అడ్వాన్సడ్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ దఫా ఈ పరీక్ష నిర్వహణ బాద్యతలను ఐఐటీ గౌహతికి అప్పగించారు. ఈ మేరకు ఐఐటీ గౌహతి గురువారం వెబ్‌సైట్‌ను ప్రారంభించి సమాచార పత్రాన్ని రిలీజ్ చేసింది.
జేఈఈ మేయిన్స్‌లో కటాఫ్ మార్కుులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మంది విద్యార్థులు ఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అర్హులు. ఇలాంటి వారు ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫలితాలను జూన్ 18వ తేదీన వెల్లడిస్తారు. అడ్వాన్స్ ఫలితాల్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఐఐటీలే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
అలాగే, ఐఐటీల్లో సీట్లు పొందాలంటే ఇంటర్‌లో ఈసారి కనీస మార్కుల నిబంధనను అమల్లోకి తెచ్చారు. ఇందులోభాగంగా, ఎస్సీఎస్టీ, దివ్యాంగులకు 65 శాతం, ఇతరులకు 75 శాతం మార్కులు సాధించి వుండాలి. అపుడే ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా, కరోనా కారణంగా ఈ మార్కుల నిబంధనకు గత మూడేళ్లుగా మినహాయింపునిచ్చిన విషయం తెల్సిందే.