ఆస్పత్రిలో వుండలేక.. కరోనా బాధితురాలు పారిపోయింది.. చివరికి..?
నల్గొండ జిల్లాలో కరోనా బాధితురాలు ఆస్పత్రి నుంచి పారిపోయింది. ఆస్పత్రిలో వుండలేక తన గ్రామానికి చేరుకుంది. చివరికి పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 సాయంతో ఆమెను వైద్య సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండల యాద్గార్ గ్రామానికి చెందిన మహిళకు కరోనా సోకింది. నల్గొండ ప్రభుత్వాస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
కానీ సోమవారం డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్‌ల కళ్లుగప్పి పారిపోయింది. ఆస్పత్రి నుంచి నేరుగా తమ గ్రామానికి వెళ్లిపోయింది. ఆమెను చూసి షాక్ తిన్న గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు గ్రామానికి చేరుకున్నారు. ఆపై ఆమెను వైద్య సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
ఇకపోతే.. ఆదివారం రాత్రి వరకు తెలంగాణ ప్రభుత్వం 1,70,324 కరోనా వైరస్ టెస్టులు నిర్వహించింది. అందులో 1,35,653 ఫలితాలు నెగిటివ్ వచ్చాయి. 34,671 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 356 మంది కరోనా వల్ల మృతి చెందారు.