బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (11:46 IST)

ఆఫీసుకు రమ్మంటే.. రాజీనామా చేస్తున్న ఉద్యోగులు.. వర్క్ ఫ్రమ్ హోమే బెటర్!

ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకు కచ్చితంగా వెళ్లాల్సిందే అనే నియమాన్ని కరోనా కొట్టిపారేసింది. ప్రపంచంలో చాలా పనులను ఇంటి నుంచి చేయొచ్చునని కోవిడ్ నిరూపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వేళ ఉద్యోగం కోసం ఆఫీసులకు రమ్మంటే చాలామంది ఉద్యోగులు ముఖం చాటేస్తున్నారట. కరోనా వేళ ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందే అంటే.. ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నారనే విషయం తాజా అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. 
 
ఓ వెయ్యి మంది ఉద్యోగుల మీద ఇటీవల అమెరికాలో జరిగిన ఓ సర్వేలో ఇప్పుడు ఆఫీసుకు రమ్మంటే 39 శాతం మంది ఉద్యోగం మానేయడానికి సిద్ధంగా ఉన్నారట. అదే మరీ కుర్రాళ్ల సంగతి తీసుకుంటే ఆ శాతం 49గా ఉందట. ఫ్లెక్స్‌జాబ్స్‌ అనే సంస్థ 2100 మంది మరో సర్వే నిర్వహించింది. అందులో ఎక్కువమంది వర్క్‌ఫ్రమ్‌ చేస్తే డబ్బులు మిగులుతాయని చెప్పారట. రవాణా, ఖర్చులు, కొవిడ్‌ జాగ్రత్తలు, కుటుంబానికి దూరంగాఉండటం, పిల్లల సంరక్షణ... ఇలా ఇవన్నీ కలుపుకొని నెలకు ఐదు వేల డాలర్లు మిగులుతాయని సర్వేలో చెప్పారు.
 
కాగా.. ప్రపంచంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదు. కొన్ని దేశాల్లో మాత్రమే అదుపులోకి వచ్చింది. దీంతో ఆయా దేశాలు, ఆ మాత్రం అదుపులో ఉన్న దేశాల్లో ఉద్యోగుల్ని వర్క్‌ ఫ్రమ్‌ హోం నుంచి ఆఫీసులకు రమ్మని పిలుస్తున్నారట. దీంతోనే ఈ సమస్య వస్తోందట. ఎక్కడ నుండి చేస్తే ఏముంది పని అవుతుంది కదా అనే ధోరణో, రిమోట్‌ వర్క్‌ కల్చర్‌ అందరికీ అలవాటు అయిపోయిన ఈ రోజుల్లో 'ఆఫీసు పని' అనేది ఓల్డ్‌ స్టైల్‌ అనే ఆలోచనో కానీ చాలామంది రావడానికి ఇష్టపడటం లేదని ప్రముఖ జాబ్‌ కన్సెల్టెన్సీల సర్వేల్లో తేలింది. ఉద్యోగులు అలా అనుకోవడానికి కూడా కారణం ఉందట.
 
చాలా దేశాల్లో ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లడానికి కనీసం ఒకటి నుంచి రెండు గంటలు పడుతుంది. తిరిగి ఇంటికి రావాలంటే అదే పరిస్థితి. దీంతో ఇంటి నుంచి పని చేసుకుంటే ఆ సమయం మిగులుతుంది అని నేటి యువత అనుకుంటున్నారట. దాంతోపాటు రవాణా ఖర్చులు, మధ్యలో అయ్యే ఖర్చులు కూడా మిగులుతాయనే భావన కూడా ఉంది. వీటి వల్ల మొత్తంగా విదేశాల్లో ఐదు వేల డాలర్ల వరకు నెలకు మిగుల్చుకోవచ్చని యువత అంచనా వేస్తున్నారట.
 
యూఎస్‌లో ఇప్పటికే 28 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులకు వస్తున్నారట. మిగిలినవాళ్లు రాకపోవడానికి పైన చెప్పుకున్నకారణాలతోపాటు... వ్యాక్సినేషన్‌ పూర్తి కాకపోవడమూ కారణమని చెబుతున్నారు. దీంతోపాటు టీమ్‌ లీడర్లు, సీనియర్లపై కూడా యువత కామెంట్లు చేస్తున్నారు. కొత్త పని విధానానికి వాళ్లు అలవాటుపడకపోవడం, ఇంటి నుంచి పని చేసేవారిపై తమ పట్టు ఉండటం లేదనుకోవడం లాంటి కారణాల వల్లే సీనియర్లు, పై అధికారులు వర్క్‌ ఫ్రమ్‌ హోంకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని యువత భావిస్తోందట.