మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 జూన్ 2021 (08:55 IST)

కరోనా వైరస్ సోకి మరణిస్తే ఉద్యోగి కుటుంబానికి ఐదేళ్ళపాటు వేతనం!

దేశంలోని ప్రముఖ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి కాలంలో ఈ వైరస్ బారిన తన సంస్థకు చెందిన ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబానికి ఐదేళ్ళపాటు వేతనం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 
 
కరోనా వైరస్ దెబ్బకు అనేక కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు కరోనా బారిన పడుతూ మృత్యువాత పడుతున్నారు. ఇలాంటివారి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. అందుకే రిలయన్స్‌ ఇండస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల పట్ల మానవత్వం చాటుకుంది. కరోనా మహమ్మారి సమయంలో రిలయన్స్‌ ఉద్యోగులకు అండగా నిలవాలని నిర్ణయించింది. 
 
కరోనాతో మృతి చెందిన ఉద్యోగులకు ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని రిలయన్స్‌ తెలిపింది. కోవిడ్‌తో మృతి చెందిన ఉద్యోగులకు చివరి నెల జీతం ఎంత తీసుకుంటారో అదే జీతం ఐదు సంవత్సరాల పాటు మృతుని కుటుంబానికి అందించనున్నట్లు వెల్లడించింది. 
 
అంతేకాకుండా మరణించిన ఉద్యోగి పిల్లలకు విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు భరిస్తామని తెలిపింది. హాస్టల్‌ వసతి, ట్యూషన్‌ ఫీజు, ఇతర విద్యకు సంబంధించిన ఖర్చులన్నీ భరిస్తామని స్పష్టం చేసింది. అలాగే ఉద్యోగి కరోనా బారినపడిన సమయంలో వారు పూర్తి కోలుకునే వరకు పూర్తి కాలానికి కోవిడ్‌ సెలవులను పొందవచ్చని తెలిపింది. 
 
ముఖ్యంగా ఉద్యోగుల్లో ఎవరికైనా కోవిడ్‌ సోకితే వారిపై ప్రత్యేక శ్రద్ద వహించనున్నట్లు రిలయన్స్‌ తెలిపింది. కోవిడ్‌ బారినపడిన మృతి చెందిన కుటుంబానికి రూ.10 లక్షల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తమ ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా వెల్లడించింది.