శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మే 2020 (09:30 IST)

ఘట్‌కేసర్ నుంచి పట్నాకు.. తెలంగాణ నుంచి రెండో రైలు ప్రారంభం

తెలంగాణ నుంచి రెండో ప్రత్యేక రైలు బయల్దేరింది. 1250 మంది కార్మికులతో ఘట్‌కేసర్ నుంచి పట్నాకు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల 20 నిమిషాలకు శ్రామిక్‌ ప్రత్యేక రైలు బయలుదేరినట్టు అధికారులు తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ రైలు ప్రయాణం మొదలైంది. 
 
మేడ్చల్ కలెక్టర్‌తో పాటు రాచకొండ సీపీ, నోడల్ అధికారి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని బిహార్ కార్మికులను గుర్తించి ప్రత్యేక రైలులో వారిని పంపించారు. గత రెండు రోజుల నుంచి వివిధ పోలీసు స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్న వారిని పంపించినట్టు అధికారులు వెల్లడించారు. 
 
కాగా ఇప్పటికే గత శుక్రవారం ఉదయం లింగంపల్లి నుంచి జార్ఖండ్‌లోని హతియాకు ప్రత్యేక రైలులో 1225 వలస కూలీలను తరలించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడపడంపై చర్చలు జరుగనున్నాయి.