శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (11:26 IST)

ఆర్టీసీ సమ్మె.. హైకోర్టు తీర్పు కోసం కార్మికులు, సర్కారు వెయిటింగ్

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 34వ రోజుకు చేరుకుంది. సమ్మెపై గురువారం హైకోర్టులో తీర్పు వెలువడనుంది. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని అటు కార్మికులు.. ఇటు ప్రభుత్వం ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. దీనిపైనా హైకోర్టులో గురువారం విచారణ జరగనుంది.  
 
కార్మికుల ప్రతినిధులతో పాటు, ప్రభుత్వం తరఫున కోర్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌ హాజరుకానున్నారు. 
 
ఇదిలా ఉండగా, కోర్టు తీర్పు అనంతరం సీఎం కేసీఆర్ ఆర్టీసీ ప్రైవేటు రూట్లపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 5100 ప్రైవేట్ బస్సులను తీసుకొస్తున్నట్టు ప్రకటించిన సీఎం.. మిగతా సగాన్ని కూడా ప్రైవేటీకరించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం 10,200 ప్రైవేట్ బస్సులకు సంబంధించి రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.