కరోనాను జయించిన వీహెచ్ దంపతులు... తెలంగాణలో 1018 కోవిడ్ కేసులు
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు దంపతులు కరోనాను జయించారు. వీహెచ్ దంపతులకు జూన్ 21వ తేదీన కరోనా సోకిందని నిర్ధారణ అయ్యింది. దీంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో పది రోజుల పాటు చికిత్స తీసుకుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారు. 60 ఏళ్ళు దాటిన వీహెచ్ దంపతులు వైరస్ నుంచి కోలుకొని బయటపడటంతో ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, జూనియర్ డాక్టర్ల సమ్మెకు మద్ధతుగా గాంధీ ఆస్పత్రికి వెళ్లినప్పుడు వీహెచ్‌కు కరోనా అంటుకుని వుంటుందని సమాచారం. కాగా, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పద్మారావు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, గణేశ్ గుప్తా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. బుధవారం కొత్తగా మరో 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ లోనే 881 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17,357 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 267మంది మృతి చెందారు.