శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (16:27 IST)

తెలంగాణాలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా... హైకోర్టుకు అఫిడవిట్

తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకలా ప్రవేశ పరీక్షలను వాయిదావేశారు. ఈమేరకు ఆ రాష్ట్ర హైకోర్టుకు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఓ అఫిడవిట్‌ను సమర్పించారు. 
 
గత కొన్ని రోజులుగా తెలంగాణాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా, హైదరాబాద్ నగర పరిధిలో ఇది మరింత ఉధృతంగా ఉంది. దీంతో తెలంగాణ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. 
 
రాష్ట్రంలో ఎంసెట్ సహా కీలక ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. వాస్తవానికి తెలంగాణలో రేపటి నుంచి పలు ప్రవేశ పరీక్షలను నిర్వహించాల్సివుంది. వీటిలో కీలకమైన ఎంసెట్ పరీక్షలకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
 
అయితే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తన వాదనలు వినిపించింది. 
 
ఎంసెట్ సహా అన్ని రకాల ప్రవేశపరీక్షలు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఎంసెట్, లా సెట్, పాలీసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ పరీక్షలు వాయిదా పడనున్నాయి.