శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (17:21 IST)

18న బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎన్నికలు - నోటిఫికేషన్ జారీ

bcci
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవికి వచ్చే నెల 18వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఆదివారం నోటిఫికేషన్‌ను జారీచేశారు. ఇందులోభాగంగా, వచ్చే నెల నాలుగో తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అక్టోబరు 18వ తేదీన ఫలితాలను వెల్లడిస్తారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బోర్డు పగ్గాలు అందుకోవడం ఖాయమని తేలిపోయింది. 
 
కాగా, బీసీసీఐ కార్యవర్గం వరుసగా రెండు పర్యాయాలు పదవుల్లో కొనసాగేందుకు ఇటీవల సుప్రీంకోర్టు సమ్మతం తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ రాజ్యాంగ సవరణలకు అత్యున్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో, బీసీసీఐ ఎన్నికలకు గంట మోగింది. ఆదివారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. 
 
బీసీసీఐ ఆఫీసు బేరర్ల పదవుల కోసం అక్టోబరు 4వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబరు 18న ఎన్నికలు జరగనుండగా, ఫలితాలు కూడా అదే రోజున వెల్లడిస్తారు. 
 
ప్రస్తుతం బీసీసీఐకి అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా వ్యవహరిస్తున్నారు. అయితే, గంగూలీ ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపట్టే అవకాశం ఉందని, జై షా బీసీసీఐ అధ్యక్షుడిగా పీఠం ఎక్కుతారని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.