గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

జో రూట్ సెంచరీ వృథా : చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ ఔట్

icc champions trophy
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలైన సంచలనం నమోదైంది. ఆప్ఘనిస్థాన్ జట్టు అద్భుత పోరాటంతో ఇంగ్లండ్‌ను ఓడించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆప్ఘని జట్టు 8 పరుగులు తేడాతో విజయం సాధించింది. తద్వారా ఇంగ్లండ్ జట్టును చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంటికి పంపించింది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ రికార్డు సెంచరీ (177)తో అదరగొట్టాడు. ఆ తర్వాత 326 పరుగుల విజయలక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ దాదాపు గెలిచినంత పనిచేసింది. మ్యాచ్ ఆఖరులో ఆ జట్టు గెలవాలంటే 13 పరుగులు అవసరం కాగా, కేవలం నాలుగు పరుగులే చేసి ఓటమిపాలైంది. ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్ అయింది. 
 
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో సీనియర్ ఆటగాడు జో రూట్ సెంచరీ సాధించాడు. రూట్ 111 బంతుల్లో 120 పరుగులు చేశాడు. బెన్ డకెట్ 38, కెప్టెన్ జోస్ బట్లర్ 38, ఓవెర్టన్ 32, హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేశాడు. ఆప్ఘన్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లు తీయడం విశేషం. మహ్మద్ నబీ 2, ఫజల్ హక్ ఫరూఖీ 1, రషీద్ ఖాన్ 1, గుల్బదిన్ నాయబ్ 1 వికెట్ చొప్పున తీశారు. ఈ విజయంతో ఆప్ఘనిస్థాన్ జట్టు గ్రూపు-బి నుంచి సెమీస్ అవకాశాలు మెరుగుపర్చుకోగా, ఇంగ్లండ్ వరుసగా రెండో ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.