ఫ్లింటాఫ్ వల్లే ఆరు బాల్స్‌తో సిక్స్ కొట్టా.. బూతు పదం వాడాడు.. గొంతు కోస్తానన్నాడు!
క్రికెట్లో కొన్నిసార్లు స్లెడ్జింగ్ ఆటగాళ్లకు అనుకూలిస్తే.. మరికొన్ని సందర్భాల్లో తిప్పికొడుతుందని భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. ప్రపంచ కప్ సందర్భంగా తనకు స్లెడ్జింగ్ అనుకూలించిందని.. తద్వారా మైదానంలో వీరవిహారం చేశానని చెప్పుకొచ్చాడు. తొలి ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌పై రెచ్చిపోవడానికి కారణం ఫ్లింటాఫ్‌తో గొడవపడటమేననే విషయం లేటుగా వెలుగులోకి వచ్చింది.
తొలి ట్వంటీ-20 వరల్డ్ కప్‌లో స్టువర్ట్ బ్రాడ్ చేసిన ఒకే ఓవర్లో వరుసగా ఆరు బంతుల్ని సిక్సులుగా మలిచి పొట్టి క్రికెట్ టోర్నీలో కొత్త రికార్డును నెలకొల్పడానికి ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో జరిగిన వాగ్వాదమే కారణమని.. ఫ్లింటాఫ్ బౌలింగ్‍లో రెండు ఫోర్లు దంచాను. అయితే అవి చెత్త షాట్లని, గొంతు కోస్తానని బూతుపదం వాడటంతో కోపం తెంచుకొచ్చిందన్నాడు.
తానూ ఫ్లింటాఫ్‌కు గట్టి షాక్ ఇచ్చే విధంగా స్పందించానని.. బ్యాట్‌తో ఎక్కడ కొడతానో తెలుసుగా అని అడిగినట్లు చెప్పాడు. ఈ వివాదంతోనే సిక్సుల మోత మోగించానని యువరాజ్ సింగ్ వెల్లడించాడు.