మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 మార్చి 2020 (16:02 IST)

ఆ క్రికెటర్ 'రియల్ వరల్డ్ హీరో' : దేశ సేవలో జోగిందర్ శర్మ!

దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఇలాంటి వారిని కట్టడిచేసేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాగే, కరోనా వైరస్ బారినపడిన వారికి వైద్యులు, నర్సులు, ఇతర సహాయక సిబ్బంది రేయింబవుళ్ళు కృషిచేస్తున్నారు. అలా, నిత్యం ప్రజాసేవలో ఉండే పోలీసు అధికారుల్లో ఓ మాజీ క్రికెటర్ కూడా ఉన్నారు. ఆయనే జోగిందర్ శర్మ. భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యుడు. 
 
ఆయ‌న‌ సొంత రాష్ట్ర‌మైన హర్యానాలో ఖాకీ దుస్తులు ధ‌రించి వీధుల్లో డ్యూటీ చేస్తున్నారు. అతని ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై అంత‌ర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్పందిస్తూ అత‌డిని రియ‌ల్ హీరోగా అభివ‌ర్ణించింది. ప్ర‌పంచమంతా క‌రోనా సంక్షోభం ఎదుర్కొంటున్న స‌మ‌యంలో త‌న‌వంతు కృషి చేస్తున్నాడ‌ని కొనియాడింది. 
 
ఇలాంటి సంక్లిష్ట ప‌రిస్థితుల్లోనూ బాధ్య‌తాయుతంగా విధులు నిర్వ‌ర్తించ‌డాన్ని నెటిజ‌న్లు కీర్తిస్తూ ఆకాశానికెత్తుతున్నారు. క‌రోనా నుంచి జ‌నాల‌ను కాపాడేందుకు వీధుల్లో చెమ‌టోడ్చుతున్నాడ‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 
 
కాగా, 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో ఆఖ‌రి ఓవ‌ర్‌ వేసిన జోగింద‌ర్‌ అద్భుత‌మైన బౌలింగ్‌తో భార‌త్‌ను గెలిపించాడు. దీంతో ఓవ‌ర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన జోగింద‌ర్ 2018లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. క్రికెట్‌లో అందించిన సేవ‌ల‌కుగానూ హ‌ర్యానా ప్ర‌భుత్వం అత‌న్ని డీఎస్పీ (డిప్యూటీ సూప‌రింటెండెంట్ ఆఫ్ పోలీస్‌)గా నియ‌మించింది. క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత జోగిందర్ పోలీస్ విధుల్లో నిమగ్నమైవున్నాడు. హ్యాట్సాఫ్ టు జోగిందర్.