గురువారం, 21 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (15:45 IST)

షఫాలీ వర్మకు జాక్‌పాట్... పెప్సీ ప్రచారకర్తగా డీల్

భారత మహిళా క్రికెట్ జట్టులో చిచ్చర పిడుగుగా ఉన్న షఫాలీ వర్మకు జాక్‌పాట్ తగిలింది. ప్రముఖ శీతలపానీయాల కంపెనీ పెప్సీ తన ప్రచారకర్తగా నియమించుకుంది. ప్రస్తుతం ఐసీసీ మహిళల ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నోతో షఫాలీ శర్మ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. 
 
జట్టు ఓపెనర్‌గా షఫాలీ... 4 మ్యాచ్‌లలో 161 పరుగులు చేసి, భారత్ జట్టు విజయంలో కీలక భూమికను పోషించారు. దీంతో ఆమె పేరు ఇపుడు మార్మోగిపోతోంది. భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో చెలరేగిపోతోంది. ఏమా బ్యాటింగ్‌, ఏమా షాట్లు అంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. రన్‌ మెషీన్‌ విరాట్‌ కోహ్లీ తరహాలో ప్రత్యర్థి బౌలర్లకు ఆమె చుక్కలు చూపిస్తోంది. 
 
ఐసీసీ విమెన్స్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2020 టోర్నీకి ముందు 19వ ర్యాంకులో ఉన్న షఫాలీ వర్మ... నాలుగు మ్యాచ్‌లు ముగిసేసరికి ఏకంగా అగ్రస్థానానికి ఎగబాకింది. అంటే.. ఆమె బ్యాటింగ్ ఎంత విధ్వంసకరంగా ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు.
 
ఇలా అభిమానుల్లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న వర్మను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకునేందుకు పలు కంపెనీలు పోటీపడుతున్నాయి. భారత్‌ ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించిన షఫాలీని రాయబారిగా నియమించుకుని తమ ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. 
 
వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఫైట్‌కు ముందు ప్రముఖ శీతల పానీయాల సంస్థ పెప్సీ షఫాలీని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకుంది. వర్మ పాపులారిటీ అమాంతం పెరిగిపోవడంతో కోట్లు కుమ్మరించడానికైనా పలు కంపెనీలు సిద్ధమైపోయాయి. ఐకానిక్‌ బ్రాండ్‌ పెప్సీతో ఒప్పందం చేసుకోవడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని షఫాలీ వ్యాఖ్యానించింది.