ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో జూనియర్ ఎన్టీఆర్?!
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిపోతున్న ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా సాగిపోతున్నారు. ఇప్పటికే ప్రజారంజక పాలన అందించే నిమిత్తం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పైగా, రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగిపోతున్నారు. ఇందుకోసం కులాలు, మతారలు, పార్టీలు ఇలా వేటిని కూడా ఆయన చూడటం లేదు.
ఇదే సమయంలో ఒకవైపు, అప్పుల ఊబితో పాటు.. ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళేందుకు జగన్ చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఓ హీరోను నియమించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.
అంటే, ఏపీ ప్రభుత్వ పర్యాటక శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్ నియామకం కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగినట్టు సమాచారం. అంతేకాదు తారక్‌కు అతి సన్నిహితంగా ఉండే మంత్రి కొడాలి నాని, ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు వైఎస్ఆర్‌సీపీలో ఇప్పుడు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారి ద్వారానే ఈ ప్రపోజల్ ముందుకు వచ్చిందని సమాచారం.
నిజానికి నారా లోకేశ్ టీడీపీలో కీలక పాత్ర పోషించసాగినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీతో అంటీఅంటనట్టుగా ఉంటున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుంచి తన సోదరి సుహాసిని పోటీ చేసినపుడు కూడా ఆయన ప్రచారం చేయకుండా, ఓ ప్రకటన ఇచ్చి మిన్నకుండిపోయారు.
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీకి ఆమడదూరంలో ఉండిపోయాడు. పార్టీ నుంచి కూడా ఆయనకు పిలుపు అందలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్.. ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసీడర్‌గా నియమించాలని భావిస్తే.. ఎన్టీఆర్ ఆ నిర్ణయానికి సమ్మతిస్తే.. రాష్ట్ర రాజకీయాల్లో ఈ నియామకం పెద్ద సంచలనమే కానుంది.