మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (15:53 IST)

భారత క్రికెట్ చిచ్చరపిడుగు షఫాలీ వర్మ.. సచిన్ రికార్డులు మాయం

షఫాలీ వర్మ... భారత మహిళల క్రికెట్‌లో ఓ సంచలనం. బ్యాట్‌ను ఝుళిపించడంలో వీరేంద్ర సెహ్వాగ్‌ను, నిలకడలో విరాట్ కోహ్లీని మురిపిస్తోంది. వెరసి... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులన్నీ మాయమైపోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న మహిళల ప్రపంచ క్రికెట్‌లో 16 యేళ్ల షఫాలీ వర్మనే హాట్ టాపిక్ అయ్యారు. 
 
ఒక్క పరుగు తీసేందుకు ఏమాత్రం ఇష్టపడని ఈ క్రికెటర్... బంతిని బాదితే బౌండరీ.. షాట్ కొడితే సిక్సర్ .. టీమ్ విక్టరీల్లో మేజర్ రోల్.. ఏజ్‌ మాత్రం జస్ట్‌ సిక్స్‌టీన్. స్ట్రెయిట్‌గా చెప్పాలంటే.. లేడీ సెహ్వాగ్. ఫలితంగా సచిన్ రికార్డులను బద్ధలుకొట్టేస్తోంది. 
 
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌ చేరిదంటే.. అది ఖచ్చితంగా షెఫాలీ ఆట వల్లే.. స్ట్రైక్ రేట్‌తో కొత్త రికార్డును సృష్టిస్తోంది. ఫలితంగా ఆమె ఆటకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. 
 
పవర్‌ ప్లేలో మెరుపు షాట్లతో అద్భుతమైన ఆరంభం ఇస్తే జట్టులో మిగిలిన ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతున్నది సహజం. అదేసమయంలో ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది సెహ్వాగ్ స్టైల్. అయితే ఇదే ఫార్మలాను లేడీ సెహ్వాగ్‌గా పేరు తెచ్చుకున్న షెఫాలీ వర్మ కూడా పాటిస్తోంది. 
 
క్రీజ్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచి షెఫాలీ దండయాత్ర మొదలౌతుంది. చెత్త బంతి పడిందా చితకబాదుడే. షెఫాలీ క్రీజ్‌లో ఉంటే.. కుదిరితే సిక్స్, లేదంటే ఫోర్.. ఒవర్‌కు బౌండరీ మాత్రం పక్కా. ఇదీ అమె లెక్క. 
 
భారత మహిళా క్రికెట్ టీంలో 16ఏళ్ల షెఫాలీ వర్మ ఆటతీరుకు క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ప్రతి మ్యాచ్‌లో అదరగొడుతోంది షెఫాలీ. ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ నిలకడగా రాణించి సెమీస్‌లోకి భారత్ వెళ్లడంలో కీలక పాత్ర పోషించింది. 
 
ఆస్ట్రేలియాపై 29, బంగ్లాదేశ్‌పై 39, న్యూజిలాండ్‌పై 46, శ్రీలంకపై 47 పరుగులు చేసి నిలకడగా రాణిస్తూ కోహ్లిని గుర్తుచేస్తోంది.. ఇక ఆడిన నాలుగు మ్యాచుల్లో 100 బంతుల్లో 161 పరుగులు చేసింది. 
 
ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ 18 ఫోర్లు, 9 సిక్సర్లు బాదింది షెఫాలీ వర్మ.. అంతేకాదు టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేసిన బ్యాట్స్‌ ఉమన్‌గా రికార్డులకెక్కింది. రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను కూడా అందుకొంది.