ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (09:18 IST)

దాయాదుల సమరానికి సై - తగ్గేదే లే అంటున్న విరాట్ కోహ్లీ

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, చిరకాల ప్రత్యర్థులైన భారత్ పాకిస్థాన్ దాయాది దేశాల మధ్య అత్యంత కీలకమైన మ్యాచ్ ఆదివారం జరుగనుంది. ఈ రెండు జట్లు దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో అభిమానులను కనువిందు చేయబోతున్నాయి. 
 
ఆదివారం స్థానిక దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం ఈ ఉత్కంఠ సమరానికి వేదిక కానుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కొన్నేళ్లుగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో దాయాదుల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లు అత్యంత అరుదుగా మారాయి. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే అభిమానులకు ఆ అవకాశం దక్కుతోంది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 గ్రూప్‌-2లో భాగంగా ఇరు జట్లు తమ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టాలనుకుంటున్నాయి. 
 
ఈ ఇరు జట్లూ చివరిసారిగా 2019 వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌-పాక్‌ తలపడ్డాయి. బ్రాడ్‌కాస్టర్ల ఖజానా నింపే ఈ మ్యాచ్‌ కోసం 17,500 టిక్కెట్లు కొన్ని గంటల్లోనే అమ్ముడుపోవడం విశేషం. అటు సమకాలీన క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లుగా కెప్టెన్లు విరాట్‌ కోహ్లీ, బాబర్‌ ఆజమ్‌ కొనసాగుతున్నారు. ప్రస్తుత బలాబలాల పరంగానూ మాజీ చాంపియన్లు సమవుజ్జీలుగానే కనిపిస్తుండడం.. ఇక్కడి వేదిక కూడా రెండు జట్లకు అలవాటే కావడంతో మ్యాచ్‌ హోరాహోరీగా సాగవచ్చు.
 
అయితే, ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై విజయాలు లేకున్నా పాక్‌ ఆ గతాన్ని గుర్తుచేసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ జట్టు టీ20ల్లో అద్భుత ఫామ్‌లో ఉంది. ఈ గ్రౌండ్‌లో ఆడిన 25 టీ20ల్లో 15 మ్యాచ్‌లు గెలిచారు. పాక్‌ టాపార్డర్‌ అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. ఓపెనర్లు మహ్మద్‌ రిజ్వాన్‌ (1462), కెప్టెన్‌ ఆజమ్‌ (1363) ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన  టాప్‌-2 క్రికెటర్లు. ఆజమ్‌ ఖాతాలో ఓ సెంచరీ కూడా ఉంది. ఇదే జోరును భారత్‌పైనా చూపాలనుకుంటున్నారు.
 
జట్లు (అంచనా)
భారత్‌:
రోహిత్‌, రాహుల్‌, కోహ్లీ (కెప్టెన్‌), సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌, జడేజా, అశ్విన్‌/రాహుల్‌ చాహర్‌, భువనేశ్వర్‌/శార్దూల్‌, షమి, బుమ్రా.
 
పాకిస్థాన్‌:
బాబర్‌ ఆజమ్‌ (కెప్టెన్‌), రిజ్వాన్‌, ఫఖర్‌ జమాన్‌, హఫీజ్‌, షోయబ్‌/హైదర్‌ అలీ, అసిఫ్‌ అలీ, ఇమాద్‌ వసీం, షాదాబ్‌ ఖాన్‌, హసన్‌ అలీ, హరీస్‌ రౌఫ్‌, షహీన్‌ అఫ్రీది.
 
పిచ్‌
ఇక్కడి వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలించవచ్చు. దీంతో భారీ స్కోరుకు అవకాశముంది. అయితే మంచు కూడా ప్రభావం చూపనుంది. టాస్‌ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపే అవకాశముంది. ఇక్కడ చేజింగ్‌ జట్లకు విజయాల శాతం ఎక్కువగా ఉంది.