శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (18:01 IST)

చెన్నై టెస్ట్ మ్యాచ్ : టీమిండియాకు ఫాలో ఆన్ గండం తప్పదా?

చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఎదురీదుతున్నారు. ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 578 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. 
 
వాషింగ్టన్ సుందర్ 33 పరుగులతోనూ, రవిచంద్రన్ అశ్విన్ 8 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ లో 578 పరుగులు చేయగా, ఇంగ్లండ్ స్కోరుకు భారత్ ఇంకా 321 పరుగులు వెనుకబడి ఉంది.
 
అంతకుముందు, ధాటిగా ఆడిన రిషబ్ పంత్ 91 పరుగులు చేసి సెంచరీకి 9 పరుగుల దూరంలో అవుటయ్యాడు. పంత్‌కు విశేష సహకారం అందించిన పుజారా 73 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. పంత్, పుజారాలను ఆఫ్ స్పిన్నర్ డామ్ బెస్ అవుట్ చేశాడు. బెస్ మొత్తమ్మీద 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. ఆట ఆరంభంలో ఆర్చర్ రెండు వికెట్లు తీశాడు. 
 
ఇదిలావుంటే, భారత్ ఫాలోఆన్ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే, తప్పకుండా 378 పరుగులు చేయాల్సి వుంది. ప్రస్తుతం 257 పరుగులు మాత్రమే చేసింది. ఇంకా మరో 212 పరుగులు చేస్తేగానీ, ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేలా లేదు 
 
అంతకుముందు.. ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసింది. ముఖ్యంగా ఆ జట్టు ఆటగాడు రూట్ భారత బౌలర్లను ఆ ఆట ఆడుకున్నాడు. ఫలితంగా రూట్ డబుల్ సెంచరీ కొట్టాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌ను రెండు రోజుల ఒక సెషన్ పాటు ఆడింది. 
 
ఆ జట్టు ఆటగాళ్లలో ఆటగాళ్లలో రోరీ బుర్న్స్ 33, డామ్ సిబ్లీ 87 పరుగులు చేయగా, వన్ డౌన్‌లో వచ్చిన డాన్ లారెన్స్ డక్కౌట్ అయ్యాడు. ఆపై వచ్చిన కెప్టెన్, 100వ టెస్ట్ మ్యాచ్‌ని ఆడుతున్న జో రూట్ అద్భుత రీతిలో భారత బౌలర్లను ఎదుర్కొని 218 పరుగులు చేయడం ద్వారా, తన సెంచరీ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
 
ఆపై బెన్ స్టోక్స్ 82, ఓలీ పోప్ 34, జోస్ బట్లర్ 30, డామ్ బెస్ 34, జేమ్స్ ఆండర్సన్ 1, జోఫ్రా ఆర్చర్ 0 పరుగులకు అవుట్ కాగా, జాక్ లీచ్ 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక భారత బౌలర్లతో జస్ ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌కు మూడేసి వికెట్లు దక్కగా, ఇషాంత్ శర్మ, షాబాజ్ నదీమ్‌కు రెండేసి వికెట్లు లభించాయి.