గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

జెంటిల్‌‌మెన్ గేమ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల అనుచిత ప్రవర్తన.. చివరకు ఫైనల్‌కు చేరారు... (Video)

sa vs pak players
క్రికెట్.. ఓ జెంటిల్‌మెన్ గేమ్. వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు పాల్గొనే ఈ క్రీడా పోటీలో ఓ ఒక్క క్రికెటర్ కూడా దురుసుగా ప్రవర్తించడు. కానీ, పాకిస్థాన్ క్రికెటర్లు మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు అనుచితంగా ప్రవర్తించారు. ఉద్దేశ్యపూర్వకంగా సఫారీ ఆటగాళ్లను రెచ్చగొట్టారు. గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు.
 
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా బుధవారం కరాచీ వేదికగా పర్యాటక దక్షిణాఫ్రికా జట్టుతో పాకిస్థాన్ జట్టు వన్డే మ్యాచ్ ఆడింది. ఇందులో పాకిస్థాన్ ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఫైనక్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌తో పాటు అనుచితంగా ప్రవర్తించారు. ఫలితంగా ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరారు. 
 
తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 353 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్యాని పాకిస్థాన్ క్రికెటర్లు మరో ఆరు బంతులు మిగిలివుండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించారు. పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (122), సల్మాన్ అఘా (134)లు సెంచరీలతో రాణించడంతో విజయ సాధ్యమైంది. శుక్రవారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 
 
అయితే, ఈ గెలుపు సంగతి అటుంచితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ళ అనుచిత ప్రవర్తన మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది. తొలుత సఫారీ ఆటగాడు మ్యాథ్యూ బ్రీట్జ్‌కేతో పాక్ బౌలర్ షహీన్ ఆఫ్రిది వాగ్వివాదానికి దిగాడు. షహీన్ సంధించిన బంతిని ఆడి పరుగు తీస్తున్న మ్యాథ్యూని షహీన్ ఉద్దేశ్యపూర్వకంగా పిచ్ మధ్యలోకి వెళ్లి అడ్డంగా నిల్చొని ఢీకొట్టాడు. ఆ తర్వాత కెప్టెన్ తెంబా బవుమా రనౌట్ అయ్యాక షాద్ షకీల్, కమ్రాన్ గులామ్ ఇద్దరూ అతడి దగ్గరకు వెళ్లి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో కల్పించుకున్న అంపైర్లు పాక్ కెప్టెన్ రిజ్వాన్‌తో చర్చించి, వార్నింగ్ ఇచ్చారు. దీంతో పాక్ ఆటగాళ్ళు శాంతించారు.