శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (09:38 IST)

కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఆఫ్ఘాన్ బౌలర్లు... ఫైనల్‌కు దూసుకెళ్లిన సఫారీలు

south africa
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ ముగిసింది. ఈటోర్నీలో అద్భుతంగా రాణించిన ఆఫ్ఘాన్ బౌలర్లు.. కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశారు. దీంతో సఫారీలు తొలిసారి ఓ ఐసీసీ మెగా ఈవెంట్ ఫైనల్‌లో అడుగుపెట్టారు. ట్రినిడాడ్‌ వేదికగా అఫ్గాన్‌తో జరిగిన సెమీఫైనల్‌-1 మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు అనూహ్య విజయాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన అఫ్గాన్‌ ఈ మ్యాచ్‌లో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఫలితంగా కేవలం 56 పరుగులకే పరిమితమైంది.
 
స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్‌ (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. అఫ్గాన్‌ బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులు సంధిస్తుండటంతో మరో ఓపెనర్‌ హెండ్రిక్స్‌ (29 నాటౌట్), తొలి డౌన్‌లో వచ్చిన మార్‌క్రమ్‌ (23 నాటౌట్) తొలుత ఒకింత తడబడ్డారు. ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకొని ఆడటంతో మ్యాచ్‌ సులువుగానే ముగిసింది. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరూకీ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.
 
అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌.. 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకు ఆలౌటైంది. టోర్నీ ఆరంభం నుంచి ఇప్పటివరకు అసాధారణ ప్రతిభ కనబరిచిన అఫ్గాన్‌ బ్యాటర్లు కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశారు. అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (10) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా బౌలర్లు వరుస వికెట్లు పడగొడుతూ అఫ్గాన్‌ను కుప్పకూల్చారు. ఓపెనర్లు గుర్బాజ్‌ (0), జర్దాన్‌ (2), తొలి డౌన్‌లో వచ్చిన గుల్బాదిన్ నైబ్ (9) పూర్తిగా విఫలమయ్యారు. 
 
ఇకపోతే, ఈ టోర్నీ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 8 గంటలకు భారత్‌ - ఇంగ్లాండ్‌ మధ్య జరగనుంది. అందులో విజయం సాధించిన జట్టుతో శనివారం రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం) దక్షిణాఫ్రికా తలపడనుంది.