31న భారత్ వర్సెస్ కివీస్ : ఆ ఇద్దరిని పక్కనబెట్టాలన్న సునీల్ గవాస్కర్
దుబాయ్ వేదికగా ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇందులో పాకిస్థాన్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. అయితే, తన తదుపరి మ్యాచ్‌ను బలమైన న్యూజిలాండ్ జట్టుతో ఈ నెల 31వ తేదీ ఆదివారం తలపడనుంది.
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కీలక సూచనలు చేశారు. భారత తుది జట్టులో రెండు మార్పులు చేయాలని సూచించారు. ఆల్ రౌండర్‌గా జట్టులోకి వచ్చిన హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయలేని పక్షంలో అతన్ని పక్కన పెట్టాలని... అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించారు.
అలాగే, బౌలర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో శార్దూల్ ఠాకూర్‌ని తీసుకోవాలని చెప్పారు. భుజం గాయంతో బాధపడుతున్న హార్ధిక్ పాండ్యా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేదు. అయితే నెట్స్‌లో మాత్రం బౌలింగ్ చేస్తూ కనిపించాడు.
ఈ నేపథ్యంలోనే హార్ధిక్‌ను పక్కన పెట్టాలని గవాస్కర్ సూచించారు. జట్టులో ఈ రెండు మార్పులు చేస్తే సరిపోతుందని... అంతకు మించి మార్పులు చేస్తే టీమిండియా భయపడుతోందని ప్రత్యర్థి జట్టు భావించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.