1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 అక్టోబరు 2016 (13:26 IST)

కన్నబిడ్డ ఐసీయూలో ఉన్నా.. మ్యాచ్ ఆడిన షమీ.. ఏకంగా 6 వికెట్లు.. భారత్‌కు నెం.1 ర్యాంక్..

క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్ తండ్రి మరణించినా క్రీజులో నుంచి తప్పుకోకుండా ఆడి జాతికి గుర్తింపు సంపాదించి పెట్టిన తరుణాలున్నాయి. అలా సచిన్ ఆడిన భారత క్రికెట్ జట్టుల

క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్ తండ్రి మరణించినా క్రీజులో నుంచి తప్పుకోకుండా ఆడి జాతికి గుర్తింపు సంపాదించి పెట్టిన తరుణాలున్నాయి. అలా సచిన్ ఆడిన భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించుకుని రాణిస్తున్న భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీ క్రికెట్ పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నాడు. 
 
ఓ వైపు కన్నబిడ్డ ఐరా(14నెలలు) శ్వాస సమస్యతో పాటు తీవ్రమైన జ్వరంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నప్పటికీ.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో షమీ ఆడాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజునే ఐరా ఆస్పత్రిలో చేరింది. అక్టోబర్ 1న రెండో రోజు ఆట ముగిసిన తర్వాత షమీకి కూతురు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసింది. కానీ టెస్టులో మిగిలిన రెండు రోజుల మ్యాచ్ బౌలర్లకు కీలకంగా మారడంతో గుండెను రాయి చేసుకున్న షమీ.. కన్నబిడ్డ సంగతిని పక్కనబెట్టి.. మ్యాచ్‌లో కొనసాగాడు. కానీ మ్యాచ్ ముగిసిన ప్రతీ రోజు రాత్రి ఆస్పత్రికి వెళ్లి తన కూతురును చూసి వచ్చేవాడు.
 
అంతేగాకుండా రెండో టెస్టులో షమీ అద్భుతమైన బౌలింగ్‌తో రాణించాడు. రెండో టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టడం ద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. ఇతర బౌలర్లు కూడా రాణించడంతో 178 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ 2-0తో టీమిండియా కైవసం చేసుకుంది.
 
క్లిష్ట సమయంలో తనకు కెప్టెన్ స్ఫూర్తినిచ్చేవాడని.. అందుకే కెప్టెన్‌తో పాటు ఇతర క్రికెటర్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని షమీ వ్యాఖ్యానించాడు. షమీపై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కూతురు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ.. ఎంతో అంకితభావంతో షమీ మ్యాచులో అద్భుత ప్రదర్శన చేశాడని కితాబిచ్చాడు. ఇదిలా ఉంటే.. సోమవారం పూర్తిగా కోలుకున్న షమీ కూతురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. ఇక క్రికెటర్లందరూ తమ సతీమణులతో కలిసి దసరా ఉత్సవాల్లో పాలుపంచుకున్నారు. ఇక టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.