శుక్రవారం, 29 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (23:02 IST)

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : శ్రీలంకను చిత్తు చేసిన బంగ్లాదేశ్

bangladesh
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, సోమవారం శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో శ్రీలంక జట్టును క్రికెట్ పసికూన బంగ్లాదేశ్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు 49.3 ఓవర్లలో 279 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. ఆ తర్వాత 280 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢాకా కుర్రోళ్లు మూడు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించారు. 
 
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 49.3 ఓవర్లలో 279 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్‌లో చరిత్ర అసలంక 108 పరుగులు చేసి రాణించాడు. ఆ తర్వాత 280 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 41.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి గెలుపొందింది. బంగ్లా గెలుపులో నజ్ముల్ హుస్సేన్ శాంటో, కెప్టెన్ షకీబ్ అల్ హాసన్ భారీ భాగస్వామ్యంతో కీలక పాత్ర పోషించారు. 
 
శాంటో 101 బంతుల్లో 12 ఫోర్లతో 90 పరుగులు చేయగా, షకిబ్ 65 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసింది. మహ్మదుల్లా 22, లిట్టన్ దాస్ 23 పరుగులు చేయగా చివర్లో తౌహీద్ హృదయ్ 7 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 15 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో మధుశంక 3, తీక్షణ 2, ఏంజెలో మాథ్యూస్ 2 చొప్పున వికెట్లు తీశారు. ఏమాత్రం ప్రాధాన్యత లేని మ్యాచ్‌లో బంగ్లాదేశ్ గెలుపొందడం ఆ జట్టుకు కాస్త ఊరటనిచ్చే విషయంగా చెప్పుకోవచ్చు.