బెల్లంపల్లి ఆకాంక్ష హత్య కేసు : ఈశాన్య భారతంలో నిందితుడి అరెస్టు
తెలంగాణ రాష్ట్రంలోని బెల్లంపల్లికి చెందిన ఆకాంక్ష (23) అనే యువతిని హత్యచేసి, పారిపోయిన నిందితుడు అర్పిత్ అనే ఢిల్లీవాసిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో అరెస్టు చేసి సోమవారం రాత్రి నగరానికి తీసుకొచ్చి సిటీ కోర్టులో హాజరుపరిచారు.
పోలీసులు వెల్లడించిన సమాచారం మేరకు.. మృతురాలు ఆకాంక్షకు, నిందితుడు అర్పిత్‌కు చాలా కాలంగా స్నేహం ఉందనీ, ఇద్దరూ ఇక్కడి ఓ సంస్థలో సహోద్యోగులుగా పని చేస్తూ వచ్చారని తెలిపారు. ఇక్కడే వారిద్దరూ సన్నిహితంగా మారారని, అర్పిత్‌కు హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లినా.. తరచుగా బెంగళూరు వచ్చి ఆకాంక్షతో స్నేహంగా మెలిగేవాడు.
అదేసమయంలో వారి స్నేహం మధ్య గొడవలూ మొదలయ్యాయి. జూన్ 5న కోడిగేహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆకాంక్షతో అర్పిత్ గొడవపడి గొంతు నులిమి హత్య చేసి మృతదేహాన్ని ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో మృతదేహాన్ని పరుపుపై పడేసి పారిపోయాడు.
ఇంతకాలం తనతో సన్నిహితంగా మెలిగిన ఆకాంక్ష.. తాను హైదరాబాద్‌కు బదిలీ అయిన తర్వాత ఇతరులతో సన్నిహితంగా మాట్లాడటం సహించలేకే గొడవపడి కడేతేర్చినట్లు తేలింది. చాన్నాళ్లపాటు గాలించినా ప్రయోజనం లేకపోయింది. అతని వివరాలపై తాజా సమాచారం అందడంతో నగర పోలీసులు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు.