సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (08:56 IST)

నిద్రలోకి జారుకున్నాక తలపై కర్రతో కొట్టి వంటగదిలో పడుకోబెట్టా... భార్య వాంగ్మూలం

murder
కట్టుకున్న భర్త ఒకరు నిత్యం తాగివచ్చి పెడుతున్న చిత్ర హింసలను భరించలేక, పైగా, అతని ఉద్యోగం తనకు వస్తుందని భావించిన ఓ భార్య.. కట్టుకున్న భర్తను కొట్టి చంపేసింది. మద్యం తాగివచ్చిన భర్త నిద్రలోకి జారుకోగానే తలపై కర్రతో బలంగా కొట్టి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని వంట గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గాంధీ కాలనీకి చెందిన శ్రీనివాస్ (50) అనే వ్యక్తి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌లో అటెండర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య సీతామహాలక్ష్మి (43) ఉంది. అయితే, గత నెల 29వ తేదీన తన భర్త వంటిట్లో జారిపడటంతో తలకు బలమైన గాయమైనట్టు వైద్యలను నమ్మించి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించింది. కానీ, కొద్ది గంటల చికిత్స తర్వాత ఆయన చనిపోయాడు. కానీ, తన తండ్రి మృతిపై అనుమానం ఉన్నట్టు కుమారుడు సాయికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 
 
పైగా, భర్తను ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత భార్య కనిపించకుండా పోయింది. దీంతో సీతామహాలక్ష్మిపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ నిఘాలో మంగళవారం రాత్రి కొత్తగూడెం నుంచి హైదరాబాద్ నగరానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లగా అక్కడ ఆమెను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో తన భర్తను ఏ విధంగా చంపిందో పూసగుచ్చినట్టు వివరించింది. దీంతో అరెస్టు చేసి జైలుకు తరలించారు.