సవతి కుమారుడు ఇంట్లో ఉంచుకోవడం ఇష్టంలేక చంపేసిన మహిళ..
సవతి కుమారుడు తమ వద్ద ఉండటం ఏమాత్రం ఇష్టంలేని ఓ మహిళ ఆ బాలుడిని మట్టుబెట్టింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఘజియాబాద్‌కు చెందిన రాహుల్ సేన్ అనే వ్యక్తి తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత రేఖ అనే మహిళన రెండో వివాహం చేసుకున్నాడు. అయితే, రాహుల్‌కు తొలి భార్యతో కలిగిన 11 యేళ్ల కుమారుడు షాదాబ్ ఉన్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన కుమారుడిని తన వద్దే ఉంచుకుని, రెండో భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే, షాదాబ్ తమ వద్ద ఉండటం ఇష్టంలేని రేఖ... అతని అడ్డు తొలగించుకోవాలని భావించింది.
ఇదిలావుంటే, ఈ నెల 15వ తేదీన షాబాద్ కనిపించకుండా పోయాడు. అతణ్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు రేఖ భర్తను నమ్మించింది. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇంటి సమీపంలోని సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. అయితే షాదాబ్ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు కనిపించలేదు.
దీంతో అనుమానం వచ్చిన పోలీసులు బాలుడి కుటుంబ సభ్యులను విచారించారు. ఈ క్రమంలో రేఖ తన నేరాన్ని అంగీకరించింది. తన స్నేహితురాలితో కలసి బాలుడిని హతమార్చి మృతదేహాన్ని మురుగు ట్యాంకులో పడేసినట్టు చెప్పింది.