గురువారం, 8 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated: ఆదివారం, 12 మార్చి 2023 (12:05 IST)

మా బంధువు అమ్మాయిని ప్రేమించావా.. అయితే రూ.5 లక్షలు చెల్లించు..

murder
ఇటీవల హైదరాబాద్ నగరంలో పవన్ అనే బాలుడు హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు గల కారణాలను పోలీసుల విచారణలో వెల్లడైంది. 'మా వాళ్ల అమ్మాయిని ప్రేమిస్తావా.. రూ.5 లక్షలు చెల్లించు' అని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు పవన్‌ను డిమాండ్‌ చేశాడు. అయితే, సంబంధిత సొమ్మును చెల్లించకపోవడంతోనే అతడిని సదరు యువతి బాబాయి, అతడి స్నేహితుడు కలిసి దారుణంగా ఆ యువకుడిని హతమార్చారు. 
 
బుధవారం రాత్రి జరిగిన ఈ హత్య కేసును బాలాపూర్‌ పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను పోలీసులు వెల్లడించారు. వాది ఎ ఉమర్‌లో నివసించే పూల్‌సింగ్‌ కుమారుడు పవన్‌(22) తన చెల్లెలి ద్వారా పరిచయమైన యువతిని ప్రేమించాడు. ఆ విషయం తెలియడంతో యువతి తల్లిదండ్రులు పహాడీషరీఫ్‌కు మకాం మార్చారు. 
 
అనంతరం యువతి బాబాయి, ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ గౌస్‌(30).. ఈ విషయాన్ని ఓ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడు మహ్మద్‌ దృష్టికి తీసుకెళ్లారు. అతను పవన్‌ను పిలిచి.. యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నందుకు క్షమించి వదిలేస్తామని, రూ.5 లక్షలు  చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఆ నగదులో తమకు వాటా లభిస్తుందని యువతి బాబాయి ఆశపడ్డాడు. ఆ తర్వాత తన తండ్రికి బెదిరింపుల విషయాన్ని పవన్ తెలిపాడు. 
 
అయితే, తాము అంత మొత్తం ఇవ్వలేమని.. 40 వేలు చెల్లిస్తామంటూ యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వాహకుడికి పవన్‌ తండ్రి చెప్పాడు. దీంతో యువతి బాబాయి గౌస్‌.. తన మిత్రుడు బార్కస్‌లో ఉండే మహ్మద్‌ సద్దాం(23)తో కలిసి పవన్‌ను కత్తులతో పొడిచి హతమార్చాడు. పెళ్లి బారాత్‌లో వినియోగించే కత్తులను నాందేడ్‌ నుంచి తెప్పించారని, పవన్‌ హత్యకు నిందితులు వాటినే వినియోగించినట్లు వారు వివరించారు.