సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (13:57 IST)

150 సార్లు వెబ్ సిరీస్ చూసి దొంగనోట్లు ముద్రించాడు...

currency notes
హైదరాబాద్ నగరంలో దొంగ నోట్లు చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను బాలా నగర్ ఎస్ఓటీ, అల్లాపూర్ పోలీసుల తాజాగా అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు 150 సార్లు వెబ్ సిరీస్ చూసి దొంగనోట్లు ముద్రించడం ప్రారంభించినట్టు గుర్తించారు. అల్లాపూర్ సీఐ శ్రీపతి ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం, వరంగల్ జిల్లాకు చెందిన వనం లక్ష్మీనారాయణ (37) కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. 
 
బోడుప్పల్‌లోని మారుతీనగర్‌లో ఉంటూ స్తిరాస్థి వ్యాపారం చేస్తున్నాడు. ఇతడిపై గతంలో కొన్ని పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన మరో ప్రైవేటు ఉద్యోగి ఎరుకల ప్రణయకుమార్ ఇతడికి మిత్రుడు. ఇటీవల ఆర్థిక పరిస్థితి దిగజారడంతో లక్ష్మీనారాయణ దొంగనోట్ల చలామణీకి నిర్ణయించుకున్నాడు. 
 
ఈ క్రమంలో ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి దొంగనోట్ల ముద్రణకు సంబంధించి ఓ బాలీవుడ్ వెబ్‌సిరీస్ గురించి తెలుసుకున్నాడు. ఓటీటీలో ఈ సిరీస్‌ను రెండు నెలల్లో 150 సార్లు వీక్షించి దొంగనోట్ల ముద్రణకు కావాల్సిన సరంజామా అంతా సమకూర్చుకున్నాడు. ప్రణయ్ కుమార్ 1:3 నిష్పత్తిలో ఒప్పందం కుదుర్చుకున్నాక తొలి విడతగా రూ.3 లక్షల విలువైన దొంగనోట్లు ముద్రించి జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో అతడితో చలామణీ చేయించాడు. 
 
తొలి ప్రయత్నం సఫలం కావడంతో మరో మారు దొంగనోట్ల చలామణీకి రెడీ అయ్యారు. ఈ క్రమంలో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పదంగా ఉన్న లక్ష్మీనారాయణ, ప్రణయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 810 రూ.500ల దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీనారాయణ ఇంట్లో సోదాలు చేయగా ప్రింటర్, ల్యాప్టాప్, ఇతర ముద్రణ సామగ్రి కూడా లభించాయి. దొంగనోట్లు ముద్రిస్తున్న గదిలోకి లక్ష్మీనారాయణ తన కుటుంబ సభ్యులను కూడా రానీయకుండా తాళం పెట్టేవాడని పోలీసులు తెలిపారు.