శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్

ఖమ్మంలో దారుణం : భార్యపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భర్త

murder
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలతో పుట్టింటికి వచ్చిన భార్యపై భర్త పెట్రోల్‌ పోసి నిప్పంటించాడో కిరాతక భర్త. జిల్లాలోని చుంచుపల్లి మండలంలో శనివారం ఈ ఘటన జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు... విద్యానగర్‌కు చెందిన లకావత్‌ స్నేహ(24)కు మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని పోచారానికి చెందిన శ్రీధర్‌తో 2021లో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. కొద్దినెలల క్రితం స్నేహ పుట్టింటికి వచ్చింది. ఆ సమయంలో పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టించి.. కూతురికి సర్దిచెప్పిన తల్లిదండ్రులు అత్తింటికి పంపించేశారు. అయినా భర్త, అత్తామామల్లో మార్పురాలేదు. 
 
వారు వేధిస్తుండటంతో స్నేహ మూణ్నెల్ల క్రితం మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. అప్పట్నుంచి ఆమె ఇక్కడే ఉంటోంది. ఈ క్రమంలో శనివారం శ్రీధర్‌ విద్యానగర్‌ వచ్చాడు. ఆ సమయంలో ఇంటి వద్ద భార్య, ఆమె చెల్లెలు నేహా, తమ్ముడు డేవిడ్‌ ఉన్నారు. అన్నం పెట్టమని అడగడంతో స్నేహ ఇంట్లోకి వెళ్లింది. 
 
ఆ సమయంలో తన వెంట సీసాలో తెచ్చిన పెట్రోల్‌ను శ్రీధర్‌ తన భార్యపై చల్లి నిప్పంటించాడు. వెంటనే అక్కడ్నుంచి పరారయ్యాడు. ఇది గమనించిన బాధితురాలి చెల్లెలు వెంటనే జరిగినదంతా తల్లిదండ్రులకు ఫోన్‌లో చెప్పింది. వారు వెంటనే వచ్చి కుమార్తెను వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. తీవ్ర కాలిన గాయాలైన స్నేహ ప్రస్తుతం చికిత్స పొందుతోందని, పరిస్థితి విషమంగా ఉందని తండ్రి సైదులు చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.