మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 మే 2023 (13:31 IST)

లంకారం ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ భారీ విగ్రహం... 28న ఆవిష్కరణ

ntr - puvvada
ఖమ్మం జిల్లాలోని లంకారం ట్యాంక్ బండ్‌పై స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహాన్ని ఈ నెల 28వ తేదీన ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నటుడు జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఆవిష్కరించనున్నారు. శ్రీకృష్ణుడి అవతారంలో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహం ఎత్తు దాదాపు 54 అడుగుల మేరకు ఉంది.
 
ఈ విగ్రహ ఆవిష్కరణపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌ నగరంలోని ఆయన నివాసంలో కలుసుకుని, విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లపై చర్చించారు. ఇప్పటికే విగ్రహం తయారీ పూర్తయి తరలింపునకు సిద్ధంగా ఉంది. ఈ విగ్రహాన్ని బేస్‌మెంట్‌తో కలిపి మొత్తం 54 అడుగులు వస్తుంది. 
 
ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీరం ఎత్తు 45 అడుగులుగా ఉంది. ఎటు చూసినా 36 అడుగులు పొడవు, వెడల్పుతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్‌పై ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇందుకోసం రూ.2.3 కోట్లను వెచ్చించారు. ఈ విగ్రహం తయారీ, ఏర్పాటులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక భూమిక పోషించారు.