1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 14 ఏప్రియల్ 2023 (14:57 IST)

సాగర తీరాన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. ప్రత్యేకతలేంటి..?

ambedkar statue
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. మొత్తం 125 అడుగుల ఎత్తులో దీన్న ఏర్పాటు చేయగా, ప్రపంచంలోనే అతిపెద్దైన విగ్రహంగా నిలిచింది. ఈ విగ్రహం రాష్ట్ర సచివాలయం పక్కనే, బుద్ధ విగ్రహానికి ఎదురుగా, తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం పక్కన ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ సాంకేతిక, తయారీ చర్యలను ఖరారు చేసేందుకు కనీసం రెండేళ్ల సమయం పట్టింది. 
 
గత 2018 ఏప్రిల్ 4వ తేదీన డీపీఆర్ రూపొందించడానికి కన్సల్టెన్సీ సేవల కోసం డిజైన్ అసోసియేట్స్‌ను నియమిస్తూ ఎస్సీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. కన్సెల్టెన్సీ, వృత్తాకార, చతురస్త్రాకార స్థూపాల డిజైన్లను సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్ వృత్తాకార నమూనాకు ఆమోదం తెలిపారు. పార్లమెంట్ భవనం నమూనాలో సిద్ధం చేయాలని సూచించారు. 
 
డిల్లీలోని రాంసుతార్ ఫైన్ ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మత్తురామ్ ఆర్ట్స్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌‌కు చెందిన శిల్పుల పర్యవేక్షణలో డీపీఆర్ సిద్ధమైంది. 2020 సెప్టెంబరు 16న ఎస్సీ సంక్షేమ శాఖ రూ.146.50 కోట్లకు పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది. 
 
2021 జూన్ ఆరో తేదీన ఒప్పందం చేసుకుని ఒక యేడాదిలో పూర్తి చేయాలని నిర్ధిష్ట కాలం ఖరారు చేశారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజున ప్రతినియోజకవర్గం నుంచి కనీసం 300 మంది చొప్పున 119 నియోజకవర్గాల నుంచి 35 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేసారు. 
 
వీరికోసం టీఎస్ఆర్టీసీ ఏకంగా 750 రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులను నడుపనుంది. ఈ విగ్రహావిష్కరణకు వచ్చే వారి కోసం భారీ ఎత్తున భోజన ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే, లక్ష స్వీట్ ప్యాకెట్లు, 1.5 లక్షల మజ్జిక ప్యాకెట్లు, అంతే మొత్తంలో వాటర్ ప్యాకెట్లను సిద్ధం చేశారు.