శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : గురువారం, 15 జూన్ 2023 (09:31 IST)

ప్రియురాలికి గర్భస్రావం చేయించి.. మరో పెళ్లికి సిద్ధమైన యువకుడు... ఎక్కడ?

arrest
తెలంగాణ రాష్ట్రంలోని కుమురం భీం జిల్లాలో తాను ప్రేమించిన యువతిని గర్భవతిని చేసి, ఆ తర్వాత గర్భస్రావం చేసిన ఓ యువకుడు... తన ప్రియురాలికి తెలియకుండా మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించి జైలు పాలయ్యాడు. పైగా, వరుడు నిజస్వరూపం తెలియడంతో వధువు కూడా ఆ మోసగాడిని పెళ్ళి చేసుకునేందుకు నిరాకరించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కౌటాల మండలం బోధన్‌పల్లి గ్రామానికి చెందిన ఏటకారి సాయి (27) కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే మండలంలోని ఓ యువతితో పరిచయమేర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. నాలుగేళ్లుగా చనువుగా తిరిగి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆ యువతి గర్భందాల్చింది. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు గర్భస్రావం చేయించాడు. అయితే, వీరిద్దరి ప్రేమ వ్యవహారం మాత్రం ఇరువురి కుటుంబాలకు తెలిసింది.. అప్పటి నుంచి సాయి తన ప్రియురాలిని దూరం పెట్టసాగాడు. 
 
ఈ క్రమంలో ఆమెకు తెలియకుండా హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమికురాలు.. అతన్ని నిలదీయడంతో గత నెల 28న పసుపుతాడు కట్టాడు. మరుసటి రోజు నువ్వు నాకు అవసరం లేదంటూ బెదిరించి వెళ్లిపోయాడు. 
 
దీంతో ఆమె కౌటాల పోలీసు స్టేషన్‌లో ఈనెల 12న ఫిర్యాదు చేయడంతో యువకుడిపై అత్యాచారం, బెదిరింపుతో పాటు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం సాయి వివాహం జరుగుతుందని బాధితురాలు పోలీసులకు సమాచారం చేరవేసింది. దీంతో వారు వధువు ఇంటికి వెళ్లి మోసకారి వాసును అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.