ఇంట్లో చిచ్చు రేపిన అప్పులు... భర్త వ్యసనాలు.. : వివాహిత జీవితం కడతేరిపోయింది..
ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. భర్త వ్యసనాలతో పాటు.. అప్పులు ఓ వివాహిత జీవితంతో అర్థాంతంగా ముగిసిపోయింది. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన చాగల్లు మండలం ఊనగట్లలో శనివారం జరిగింది. స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు..
జిల్లాలోని భీమవరం మండలం గుత్తులవారిపాలెంనకు చెందిన సాయిహరిత(25)కు ఊనగట్లకు చెందిన డి.వెంకటేశ్వర్లుతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. వెంకటేశ్వర్లు పొక్లెయిన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ, వ్యసనాలకు బానిసై ఆర్థికంగా నష్టపోయాడు. దీనికితోడు భార్యపై అనుమానంతో ఐదు నెలల క్రితం ఖమ్మం పట్టణానికి మకాం మార్చారు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి.
దీంతో సొంతూరు వెళ్లిపోమని సాయిహరిత తల్లి చెప్పేవారు. దానికి వెంకటేశ్వర్లు ఏమాత్రం ఒప్పుకొనేవాడు కాదు. ఇలావుండగా, ఈ నెల ఒకటో తేదీన భీమవరంలో శుభకార్యం నిమిత్తం సాయిహరిత పిల్లలతో పాటు వచ్చింది. 5వ తేదీన ఊనగట్లకు వచ్చింది. శనివారం తెల్లవారుజామున వెంకటేశ్వర్లు ఖమ్మం నుంచి ఊనగట్లకు వచ్చాడు. అప్పటివరకు కోడలుకు సాయంగా పడుకున్న ఆదమ్మ.. కొడుకు రావడంతో బయటకు వెళ్లి వరండాలో పడుకుంది.
ఉదయం లేచి చూసేసరికి కుమారుడు కనిపించలేదు. కోడలి ముఖంపై దుప్పటి కప్పి ఉంది. పిలిచినా పలక్కపోవడంతో అనుమానం వచ్చి బంధువులను పిలిచి చూడగా సాయిహరిత మృతిచెందినట్లు గుర్తించారు. గ్రామీణ ఎస్ఐ వైవీ రమణ సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.
ఆడపిల్ల లేదని పెంచుకుంటే సాయిహరిత తల్లి ధనలక్ష్మి, తండ్రి వెంకటేశ్వరరావులు కుటుంబ కలహాలతో వేర్వేరుగా ఉంటున్నారు. ధనలక్ష్మి సోదరి పుణ్యవతికి కుమారులే ఉన్నారు. కుమార్తెలు లేరు. ఈ క్రమంలో పుణ్యవతి.. సాయిహరితను పెంచారు. ధనలక్ష్మి దుబాయిలో ఉంటూ అప్పుడప్పుడు వస్తారు.