గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (11:43 IST)

బాబాయ్‌పై కోడికత్తితో దాడి.. చికిత్స పొందుతూ మృతి

knife
పాత గొడవల నేపథ్యంలో సొంత బాబాయ్‌పై ఓ యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ ఘటన ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు...
 
స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌ చెరువు రోడ్డులో నివాసం ఉండే ఇళ్ల శ్రీనివాసులు (23)కు వరుసకు బాబాయి అయిన గోసుల ఏడుకొండలు అలియాస్ బాలాజీ (27)తో పాత గొడవలు ఉన్నాయి. వారి మధ్య గొడవలను పెద్దల సమక్షంలో పరిష్కరించుకునేందుకు గాంధీ బొమ్మ సెంటరుకు వచ్చారు. అక్కడ వారిద్దరి మధ్య మళ్లీ గొడవలు జరిగాయి. ఈ క్రమంలో శ్రీనివాసులు తన వెంట తెచ్చుకున్న కోడికత్తితో ఏడుకొండలుపై విచక్షణా రహితంగా దాడి చేసి అక్కడ నుంచి పారిపోయాడు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలాజీని స్తానిక ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శ్రీనివాసులుని అదుపులోకి తీసుకున్నారు. పెయింటర్‌గా పని చేసే మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.