కమలం పార్టీలోకి ఈటల రాజేందర్ : కిషన్ రెడ్డితో మంతనాలు?
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్‌కు గురైన ఈటల రాజేందర్ చూపు కాషాయం పడింది. ప్రస్తుతం ఆయన్ను తెరాస పార్టీ నుంచి బయటకు పంపించేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయన తన పరపతితో పాటు ఆస్తులను కాపాడుకునేందుకు, రాజకీయంగా దెబ్బతినకుండా ఉండేందుకు వీలుగా జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీలో చేరాలని భావించారు. ఆ దిశగా ఆయన మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం.
ఈ మధ్య మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై భారీ అవినీతి ఆరోపణలు వచ్చాయి. చాలా రోజులుగా సీఎం కేసీఆర్‌కు.. మంత్రి ఈటల రాజేందర్‌కు బేదాభిప్రాయాలు ఉన్నాయి. అంతేకాదు సీఎం కేసీఆర్ నిర్ణయాలపై సమయం దొరికనప్పుడల్లా బహిరంగానే విమర్శలు సైతం చేస్తూ వస్తున్నారు.
ఇదే క్రమంలో మెదక్ జిల్లాలో దాదాపు 20 ఎకరాల అసైన్డ్ భూమిని ఈటల రాజేందర్ కబ్జా చేసిన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈటలను మంత్రి పదవి నుంచి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. అయితే, గత కొంతకాలంగా తన కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఈటల రాజేందర్ సొంత పార్టీ పెడతారన్న ప్రచారం సాగింది.
అయితే, తాజా పరిణామాలను చూస్తుంటే ఆయన బీజేపీలో చేరనున్నారని వార్తలు అందుతున్నాయి. ఇదే క్రమంలో మొయినాబాద్‌లోని బీజేపీ నేత వివేక్ వెంకటస్వామికి చెందిన ఫాంహౌస్‌లో బీజేపీ నేతల రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి ఢిల్లీ దూత బీజేపీపీ జాతీయ నాయకుడు భూపేందర్ యాదవ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా హాజరైనట్లు సమాచారం.
ఈ భేటీలో బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ సహా పలువురు బీజేపీ పార్టీ రాష్ట్రస్థాయి అగ్ర నాయకులు పాల్గొన్నారు. ఈ మీటింగ్‌పై అత్యంత జాగరూకత వహించినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కొందరు ముఖ్యనాయకులు గతంలోనే బహిరంగంగా ఈటెలకు అనుకూల వ్యాఖ్యలు చేశారు. ఈటలను తమ పార్టీలో చేర్చుకోవాలని కూడా భావించింది.
అయితే, ఇందుకు సరియైన పొంతనలు కుదురక ఈటల దాటవేసినట్లు సమాచారం. అయితే, హుజూరాబాద్ నియోజకవర్గానికి ఎన్నికలు వస్తే ఖచ్చితంగా అది టీఆర్ఎస్ - ఈటెల మధ్య పోటీ ఉండబోతున్నట్లు స్థానిక ప్రజల అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్‌లో అభ్యర్థిని నిలిపిన ఓటమి తప్పదనే భావనలో ఉన్నారు. దీంతో కొంత కాలం ఈటలకు మద్దతు ఇచ్చి పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినట్లు సమాచారం.
ఇక, ఈటల ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తోసైతం ఈటల భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు విషయాలపై వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో మంచిస్థానాన్ని కల్పిస్తానంటే బీజేపీలోకి వచ్చేందుకు తాను సిద్ధమేనని ఈటల సంకేతాలు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో అరవింద్ ఈ విషయాన్ని రాష్ట్ర, కేంద్ర పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది.