శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జెఎస్కె
Last Modified: శుక్రవారం, 6 ఆగస్టు 2021 (22:21 IST)

కాద‌న్న కార్పొరేట్, కాంస్యం అందించిన హాకీ జ‌ట్టు

వీళ్ళ వ‌ల్ల ఏమీ కాద‌న్న కార్పోరేట్... వారిని చేరదీసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ...చివ‌రికి దేశాన్ని గెలిపించారు. టోక్యో ఒలంపిక్స్ లో భారత్ మెన్స్ హాకీ జట్టు అద్భుతమైన ప్రతిభతో.. 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో మెడల్ సాధించింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత్ టీం జర్మనీతో తలపడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది భారత హాకీ టీం.

కెప్టెన్ మన్ ప్రీత్ సేన భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది. 41 ఏళ్ల క్రితం మాస్కో ఒలంపిక్స్ తర్వాత ఒలంపిక్స్ లో హాకీలో పతకం రావటం ఇదే.. అందరూ భారత హాకీ జట్టుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.. కీర్తిస్తున్నారు.. తెర వెనక హాకీ జట్టుకు సపోర్ట్ చేసింది.. ప్రోత్సహించిన వ్యక్తి ఒకరు ఉన్నారు.. ఆయనే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. దేశం మొత్తం పట్టించుకోని వేళ ఆయన ఇచ్చిన 100 కోట్లే, ఈ రోజు హాకీ జట్టు విజయానికి కారణం అయ్యాయి.
 
అసలు విషయంలోకి వస్తే.. భారత హాకీ జట్టు పేలవమైన ప్రదర్శన కారణంగా అప్పటి వరకు స్పాన్సర్ షిఫ్ గా ఉన్న సహారా కంపెనీ తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. 2018 సంవత్సరంతో పురుషుల, మహిళల జట్టుతో ఉన్న అన్ని కాంట్రాక్టులను రద్దు చేసుకుంది సహారా కంపెనీ.
 
ఇదే సమయంలో స్పాన్సర్ షిప్ కోసం భారత హాకీ ఫెడరేషన్ ఎన్నో కార్పొరేట్ కంపెనీలను అప్రోచ్ అయ్యింది. ఎవరూ ముందుకు రాలేదు. హాకీ జట్టు గెలిచేది లేదూ చచ్చేదీ లేదు.. అనవసరం డబ్బులు పోతాయ్.. ఇవన్నీ అటు ఉంచితే హాకీ మ్యాచ్‌లు చూసేది ఎవరు అంటూ ఎగతాళి చేశాయి కార్పొరేట్ కంపెనీలు.
 
సరిగ్గా ఇక్కడే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఎంటర్ అయ్యారు. హాకీ జట్లకు ఒడిశా ప్రభుత్వం తరపున 100 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు కుర్చుకున్నారు. 2023 వరకు ఒడిశా ప్రభుత్వం భారత హాకీ జట్లకు స్పాన్సర్‌గా ఉంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. భారతీయ క్రీడ ఏదీ అంటే హాకీ.. అలాంటి జాతీయ క్రీడకు కంపెనీలు ముందుకు రాకపోవటం అతన్ని కలిచివేసింది. దీనికి మించి.. మంచి హాకీ ప్లేయర్ నవీన్ పట్నాయక్. చిన్నతనంలో హాకీ ఆడేవారు. డూన్ స్కూల్ లో చదివే రోజుల్లో హాకీ జట్టుకు గోల్ కీపర్ గా ఉన్నారు. ఇప్పటికీ రెగ్యులర్‌గా హాకీ మ్యాచులు చూస్తూ ఉంటారు సీఎం నవీన్ పట్నాయక్. క్రికెట్ కంటే హాకీనే ఇష్టం అంటారు ఆయన.
 
హాకీపై అతనికి ఉన్న మక్కువతోనే.. ఒడిశా ప్రభుత్వం తరపున నవీన్ ప‌ట్నాయ‌క్ భారత హాకీ జట్లకు స్పాన్సర్ గా వ్యవహరిస్తున్నారు.100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించటానికి అవసరం నిధులు సమకూర్చారు. 2023 సంవత్సరం వరకు భారత పురుషులు, మహిళల హాకీ జట్లకు అవసరం అయిన అన్ని ఖర్చులు భరించటానికి ముందుకు వచ్చారు. ద‌టీజ్ ఒడిస్సా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్.