సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (19:05 IST)

వై.ఎస్. జగన్‌ను ఇబ్బందుల్లోకి నెడుతున్న టిటిడి ఉన్నతాధికారులు.. ఎలా?

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిటిడిలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు దేశవ్యాపితంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయని, గుప్త నిధుల కోసం శ్రీవారి పోటులో తవ్వకాలు జరిపారని అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. మాయమైన ఆభరణాల్లో పింక్‌ డైమండ్‌ జెనీవాలో వేలానికి వచ్చిందంటూ కొన్ని ఆధారాలనూ ఆయన చూపించారు.
 
ఈ వివాదంపై అప్పట్లో వైసిపి నేతలు చురుగ్గా స్పందించారు. ప్రత్యేకించి విజయసాయిరెడ్డి దూకుడుగా స్పందించారు. శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయంటూ రమణ దీక్షితులు చేసిన ఆరోపణల్లో వాస్తవముందని చెప్పారు. పోటులో తవ్వకాలు జరిపారని కూడా ఆయన చెప్పారు. ఆలయం నుంచి తీసుకెళ్లిన శ్రీవారి ఆభరణాలు చంద్రబాబు ఇంటికి చేరాయని, వెంటనే ఆయన ఇంటిని తనిఖీ చేయాలని డిమాండ్‌ చేశారు.
 
ఈ క్రమంలో ఆగ్రహించిన అప్పటి ప్రభుత్వం… తమపై ఆరోపణలు చేసిన విజయసాయి రెడ్డిపైన కేసులు పెట్టాలని టిటిడి పెద్దలను ఆదేశించింది. దీంతో దుమారానికి కారణమైన రమణ దీక్షితులుపైన, ఆ వివాదంలో సంచలన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి పైన న్యాయస్థానంలో రూ.200 కోట్లకు పరువునష్టం దావా వేశారు. ఈ కేసు ఇప్పటికీ న్యాయస్థానంలో ఉంది.
 
ఇలా కేసు వేయడాన్ని చాలామంది తప్పుబట్టారు. ఆరోపణల్లో నిజానిజాలు ఏమిటో తేల్చాల్సిందిబోయి… కేసులు వేయడం ఏమిటన్న ప్రశ్న వచ్చింది. కక్ష సాధింపుతోనే కేసులు పెట్టారని వైసిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల అనంతరం మూడు నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. వైసిపి అధికారంలోకి వచ్చింది. దీంతో టిటిడి ఛైర్మన్‌ మారారు, తిరుమల జెఈవో శ్రీనివాసరాజు బదిలీ అయ్యారు. మారిన పరిస్థితుల్లో…. రమణ దీక్షితులు, విజయసాయి రెడ్డిపై పెట్టిన కేసులను టిటిడి వెనక్కి తీసుకుంటుందని సహజంగానే అందరూ భావించారు.
 
టిటిడిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే…. గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్ధినీయమే అని చాటిచెప్పేలా ఉన్నాయి. ఇప్పుడు ఏ సందర్భమూ లేకున్నా… శ్రీవారి ఆభరణాల అంశాన్ని చర్చనీయాంశం చేశారు. శ్రీవారి ఆభరణాల జాబితాలో పింక్‌ డైమండ్‌ అనేది లేదని, స్వామి ఆభరణాలు మామయ్యాయంటూ స్వార్ధంతో కొందరు ఆరోపణలు చేస్తున్నారని తిరుమల ప్రత్యేకాధికారిగా నియమితులైన ధర్మారెడ్డి మీడియాకు చెబుతున్నారు. పోటులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగే అవకాశాలే లేవని కూడా ఆయన ఘంటాపథంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలను ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ కూడా సమర్ధించారు.
 
ఈ పరిణామాలు వైసిపి ప్రభుత్వానికి, నేతలకు ఇబ్బందికరంగా మారుతాయనడంలో సందేహం అక్కర్లేదు. ధర్మారెడ్డి, అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చెబుతున్నట్లు… ఆభరణాలు మాయం కాకున్నా మాయమైనట్లు ప్రచారం చేసినందువల్ల రమణ దీక్షితులు, వైసిపి ఎంపి విజయసాయిరెడ్డిపై తెలుగుదేశం ప్రభుత్వం కేసులు వేయడాన్ని ఆహ్వానించాలి. ఈ కేసులను టిటిడి బలంగా వాదించి… ఆ ఇద్దరికీ శిక్ష పడేలా చూస్తారని అనుకోవాలి. ఆభరణాల వివాదాన్ని ఎన్నికల ప్రచారాంశంగా వాడుకున్న సీఎం జగన్ కూడా సమాధానం చెప్పుకోవాల్సి రావచ్చు. ఇదంతా తలనొప్పి వ్యవహారమే కదా..!
 
టిటిడి అధికారులు ఆభరణాల అంశాన్ని ఎందుకు తెరపైకి తెచ్చారు, ఇందులో ఏదైనా వ్యూహం ఉందా, ఇది ఎటువంటి పరిణామాలకు దారి తీయవచ్చు, అప్పుడు ఎవరు ఎలా స్పందిస్తారు, ఇంతకీ విజయసాయిరెడ్డి స్పందన ఏమిటి…. ఇవీన్న కొన్ని రోజుల్లోనే తెలిసే అవకాశముంది.